అమెరికా గోల్ఫ్‌లో తెలుగు కెరటం

Telugu golfer in American golf - Sakshi

పీజీఏ టూర్‌లో రాణిస్తున్న తీగల సాహిత్‌ రెడ్డి

నపా (అమెరికా): అమెరికాకు చెందిన తెలుగు గోల్ఫర్‌ తీగల సాహిత్‌ రెడ్డి ఫార్టీనెట్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో మెరిశాడు. 73 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతను 11 పాయింట్ల స్కోరుతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. టాప్‌–10లో నిలిచిన సాహిత్‌కు 2 లక్షల 70 వేల డాలర్లు (రూ.2 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికీ ఫాలెర్, నిక్‌ టేలర్‌లు కూడా 11 స్కోరు చేయడంతో ముగ్గురు ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల ఈ తెలుగు గోల్ఫర్‌ తాజా ప్రదర్శనతో ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (పీజీఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు.

ఎవరీ తీగల సాహిత్‌?
సాహిత్‌ రెడ్డి జన్మతః అమెరికన్‌ అయినప్పటికీ భారతీయుడు. హైదరాబాద్‌కు చెందిన తీగల   మురళీధర్‌ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1987లో అమెరికాకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయ్యాక తెలుగమ్మాయి కరుణను వివాహమాడి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.   వీరికి సాహిత్‌తో పాటు మరో కుమారుడు సహన్‌ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ అతని కుటుంబం ప్రతీ రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి వెళుతుంది. 2001లో సాహిత్‌ తల్లి థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారిన పడటంతో ఇద్దరి పిల్లల బాగోగులు అమ్మమ్మ విజయలక్ష్మి చూసుకునేది. చిన్నప్పటి నుంచి సాహిత్‌కు గోల్ఫ్‌ అంటే సరదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆటను ఆపలేదు.

దీని ఫలితం ఇప్పుడు ప్రొఫెషనల్‌ అయ్యేందుకు దోహదపడింది. 2020లో ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌గా మారిన సాహిత్‌ ఈ రెండున్నరేళ్లతోనే సంచలన ప్రదర్శనతో అది కూడా అసాధారణ పోటీ ఉండే అమెరికాలో ఈ స్థాయికి దూసుకురావడం గొప్ప ఘనత. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న సాహిత్‌ 2021–22 సీజన్‌లో జోరు పెంచాడు. మొత్తం నాలుగు టోర్నీల్లో టాప్‌–10లో నిలిచాడు. దీంతో ఈ సీజన్‌లోనే సాహిత్‌ 17 లక్షల డాలర్లు (రూ.13 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ  రూపేణా సంపాదించడం గమనార్హం. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ టోర్నీల్లో భారత ఆటగాళ్లు చాలా మందే ఆడుతున్నారు కానీ ఓ హైదరాబాదీ ఈ స్థాయిలో రాణిస్తుండటం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top