T20 WC: పాకిస్తాన్‌ గట్టి పోటీనివ్వలేదు... టీమిండియాదే విజయం...

T20 WC: Ajit Agarkar Dont Think Pakistan Will Pose Much Challenge To India - Sakshi

 Ajit Agarkar Comments: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌.. టీమిండియాకు గట్టి పోటీనిచ్చే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు. అయితే, దాయాది జట్టును తక్కువగా అంచనా వేయకూడదని, ఏ నిమిషంలో మ్యాచ్‌ ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమన్నాడు. ఏదేమైనా గత అనుభవాలు, గణాంకాల ఆధారంగా టీమిండియా విజయం ఖాయమని అభిప్రాయపడ్డాడు. 

కాగా సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా టీమిండియా- పాకిస్తాన్‌ టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌లో ముఖాముఖి తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్‌ అగార్కర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఎల్లప్పుడూ అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే, ప్రస్తుత ఫామ్‌, గణాంకాలు పరిశీలిస్తే.. పాక్‌తో భారత్‌కు పెద్దగా పోటీ ఉంటుందని చెప్పలేం. 

అలాగని ఆ జట్టును మరీ అంత తేలికగా కొట్టిపారేయలేం. క్రికెట్‌ ఓ ఫన్నీ గేమ్‌. ముఖ్యంగా టీ20 ఫార్మా ట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌-2007 నాటి అనుభవాలను అగార్కర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

‘‘వరల్డ్‌కప్‌-2007 టూర్‌ మాకెంతో ప్రత్యేకం. యువ ఆటగాళ్లతో నిండిన ఆనాటి జట్టు... పాకిస్తాన్‌ మీద ఘన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇండో- పాక్‌ మ్యాచ్‌ అంటే... భావోద్వేగాల సమాహారం. వరల్డ్‌కప్‌ అంటే అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయి’’ అని పేర్కొన్నాడు. కాగా ఎంఎస్‌ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్‌కప్‌-2007 ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: T20 WC: అతడు ఫామ్‌లో లేనంత మాత్రాన.. ఆందోళన అవసరం లేదు: కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top