T20 WC 2022: టీమిండియా ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే కష్టమే.. అయితే: మాజీ హెడ్‌కోచ్‌

T20 WC 2022: Ravi Shastri Feels India Need To Work Hard On Fielding - Sakshi

T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీ ఆరంభం నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి రోహిత్‌ సేనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉందని.. ఫీల్డింగ్‌ లోపాన్ని సరిచేసుకుంటే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు.

ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా..
ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇటీవలి కాలంలో రోహిత్‌ సేన టీ20 క్రికెట్‌లో వరుస సిరీస్‌లు గెలిచినప్పటికీ.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లోపాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడవటం ఆసియా కప్‌-2022 టోర్నీలో తీవ్ర ప్రభావం చూపింది.

ఆ 15- 20 పరుగులే
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ముందుగా ఫీల్డింగ్‌ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంది. కఠినంగా శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డర్లు సేవ్‌ చేసే 15-20 పరుగులే మ్యాచ్‌ ఫలితాన్ని మార్చివేసేంతగా ప్రభావం చూపగలవు. నిజానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా వంటి జట్లు ఫీల్డ్‌ను సెట్‌ చేసే విధానం క్రేజీగా ఉంటుంది. 

అంతెందుకు ఆసియా కప్‌లో శ్రీలంక ఎలా ఫీల్డింగ్‌ చేసిందో.. ఎలాంటి ఫలితాలు పొందిందో మనం చూశాం. ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన విధానం అందరికీ గుర్తుండిపోతుంది. ఇటీవలి కాలంలో ఫీల్డింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు. కాబట్టి ఆ విషయంలో కచ్చితంగా మెరుగుపడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.

వాళ్లు అద్భుత ఆటగాళ్లు
ఇక బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి చెబుతూ.. ‘‘గత ఆరేడేళ్ల పాటు నేను టీమిండియాతో ప్రయాణం చేశాను. అయితే, మునుపెన్నడూ లేని విధంగా టీ20 క్రికెట్‌లో భారత బ్యాటింగ్‌ లైనప్‌ మరింత దృఢంగా తయారైంది. 

నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో హార్దిక్‌ పాండ్యా, ఆరో స్థానంలో రిషభ్‌ పంత్‌ లేదంటే దినేశ్‌ కార్తిక్‌ ఉన్నారన్న ధీమాతో టాపార్డర్‌ మరింత దూకుడుగా ఆడేందుకు వీలు కలిగింది’’ అంటూ మిడిలార్డర్‌పై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కాగా రవిశాస్త్రి మార్గదర్శనంలో విరాట్‌ కోహ్లి సారథ్యంలో గతేడాది ప్రపంచకప్‌ ఆడిన టీమిండియా కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.

చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్‌ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌
T20 Tri Series: నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌కు చెమటలు పట్టించిన బంగ్లా! చివరికి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top