
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్‌లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు.
తన తొలి ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్‌లో 2 నో బాల్‌లు, 3 వైడ్లు.. మూడో ఓవర్‌లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్‌లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్‌లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు.
భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు.