ఎస్‌ఆర్‌హెచ్‌లోకి ప్రపంచకప్‌ హీరో | SRH sign RS Ambrish as Shivam Mavi replacement | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌లోకి ప్రపంచకప్‌ హీరో

May 1 2026 6:25 PM | Updated on May 1 2026 6:58 PM

SRH sign RS Ambrish as Shivam Mavi replacement

ఐపీఎల్‌ 2026 నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇవాళ (మే 1) ఓ కీలక ప్రకటన చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్‌ శివమ్‌ మావి స్థానాన్ని అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 హీరో, యువ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. 

18 ఏళ్ల అంబ్రిష్‌ ఈ ఏడాది భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో 11 వికెట్లు తీసి భారత తరఫున సంయుక్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. కుడిచేతి మీడియం పేసర్ అయిన అంబ్రిష్, ఎడమచేతితో బ్యాటింగ్‌ చేస్తాడు. 

లోయర్‌ ఆర్డర్‌లో అతను ఉపయోగకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఎస్‌ఆర్‌హెచ్‌కు అదనపు బలంగా మారనుంది. ఇప్పటికే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి దేశీయ యువ పేసర్లతో కలకలలాడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌కు అంబ్రిష్‌ మరో అస్త్రంగా మారే అవకాశం ఉంది.

మావి విషయానికొస్తే.. ఈ సీజన్‌ వేలంలో ఇతన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.75 లక్షల బేస్‌ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతను గజ్జలో గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఎస్‌ఆర్‌హెచ్‌ అంబ్రిష్‌ను ఎంపిక చేసుకుంది (రూ. 30 లక్షలకు).

ఇదిలా ఉంటే, సీజన్‌ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్‌ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, రన్‌రేట్‌ (0.832) కూడా మెరుగ్గానే కలిగి ఉంది. తాజాగా ముంబైపై 244 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. మే 3న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement