ఐపీఎల్-2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదో ఓటమి ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో పాట్ కమ్మిన్స్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానానికి చేరుకుంది.


