దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్ అనే ఫ్రాంచైజీ తమ ఆల్‌రౌండర్ బేయర్స్ స్వానెపోల్‌ను సస్పెండ్ చేసింది. ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు.
చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్ కొనసాగించాలని లయన్స్‌ను ఆజ్ఞాపించాడు. బేయర్స్ మైదానం వీడే సమయానికి మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్ గైర్హాజరీలో లయన్స్ 10 మందితోనే మ్యాచ్ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది.
ఆ మ్యాచ్‌లో బేయర్స్ ఉండి ఉంటే, ఫలితం లయన్స్‌కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్‌లో బేయర్స్ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్‌ను మ్యాచ్‌లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్ ఇచ్చి లయన్స్ ఓటమికి కారకుడయ్యాడు.
ఇంతకీ బేయర్స్ అంత అర్జెంట్‌గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్‌షైర్ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్ అయితే వోర్సెస్టర్‌షైర్‌తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్ స్వయంగా చెప్పాడు.
బేయర్స్ చర్యను చాలా సిరీయస్‌గా తీసుకున్న లయన్స్ యాజమాన్యం అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. బేయర్స్ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది.
అతను క్రికెట్ సౌతాఫ్రికా నుంచి ఎన్‌వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్ కౌంటీ ఛాన్స్ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.
ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్ స్పందించాడు. లయన్స్ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు.


