సౌతాఫ్రికా దిగ్గజ మహిళా క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనుంది. వచ్చే నెల ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఆమెను జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

37 ఏళ్ల ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అదే ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఆమె రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలింగ్ విభాగంలో లోటు స్పష్టంగా కనిపించింది.
క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఈనాక్, హెడ్ కోచ్ మండ్ల మషింబితో జరిగిన చర్చల అనంతరం షబ్నిమ్ తిరిగి ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షబ్నిమ్.. ఓ టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20ల్లో 317 వికెట్లు తీసింది.
షబ్నిమ్ అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌లో అదరగొడుతోంది. ఆమె భారత్‌లో జరిగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్, హండ్రెడ్ లీగ్, బిగ్‌బాష్ లీగ్ తదితర టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు చేసింది. మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన రికార్డు కూడా షబ్నిమ్ పేరిటే ఉంది.
కాగా, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ కూడా గతేడాది రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసిన ప్రోటీస్ జట్టుకు షబ్నిమ్ ఇస్మాయిల్ రీఎంట్రీ భారీ ఊతమివ్వనుంది.


