నిలకడగా ‘దాదా’ ఆరోగ్యం

Sourav Ganguly Undergoes Angioplasty, Now Stable - Sakshi

వెంటనే యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు  

మూడు రక్తనాళాలు బ్లాక్‌ అయినట్లు గుర్తింపు

ఆసుపత్రిలో మరో మూడు రోజులు  

నిలకడగా ‘దాదా’ ఆరోగ్యం

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వల్ప స్థాయి గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నగరంలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం యాంజియోప్లాస్టీ చేశారు. ఇందులో మూడు పూడికల్ని (బ్లాకులు) గుర్తించారు. ప్రస్తుతం గంగూలీని ఇంటెన్సివ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో ఉంచిన నిపుణులైన వైద్యబృందం ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. టీమిండియా విజయవంతమైన మాజీ కెప్టెన్‌ గంగూలీ అనారోగ్యం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.


గంగూలీ భార్య డోనా, కూతురు సనా

విషయం తెలుసుకున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్, రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రతాప్‌ బెనర్జీ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (సీఏబీ) అధ్యక్షుడు అవిశేక్‌ దాల్మియా ఆసుపత్రికి వెళ్లి గంగూలీని పరామర్శించి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 48 ఏళ్ల గంగూలీ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 113 టెస్టుల్లో, 311 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్‌ 49 టెస్టులు ఆడి 21 విజయాలు సాధించింది. 13 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వన్డేల్లో గంగూలీ నాయకత్వంలో టీమిండియా 146 మ్యాచ్‌లు ఆడింది. 76 మ్యాచ్‌ల్లో గెలిచి, 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2015 నుంచి 2019 వరకు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరించిన గంగూలీ 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.  


ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ

ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా... 
నిజానికి శుక్రవారం రాత్రే గంగూలీకి ఛాతీలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. అయినాసరే ఉదయం తన రోజువారీ దైనందిన పనులకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే సాధారణ వర్కౌట్లు చేశాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా అతనికి ఛాతీనొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆలస్యం చేయకుండా స్థానిక వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ముందుగా హృదయ సంబంధిత పరీక్షలన్నీ చేసిన వైద్య బృందం ఈసీజీ, ఎకో టెస్టుల తేడాల్ని పరీశిలించింది. డాక్టర్‌ సరోజ్‌ మండల్‌ నేతృత్వంలోని వైద్యబృందం గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించింది. అలాగే అతని కుటుంబీకుల్లో హృద్రోగుల చరిత్ర ఉండటంతో వెంటనే కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించింది.

‘దాదాకు స్వల్ప గుండెపోటు వచ్చింది. పరీక్షల్లో గుండె మూడు రక్తనాళాలు బ్లాక్‌ అయినట్లు గుర్తించాం. దీంతో యాంజియోప్లాస్టీ చేసి అత్యవసరమైన చోట ఒక స్టంట్‌ వేశాం. ఇప్పుడైతే అతను స్పృహలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే మూణ్నాలుగు రోజుల పాటు అత్యవసర విభాగంలోని వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే ఉంచుతాం. ఆరోగ్యస్థితిని అంచనా వేస్తాం. ఇంకా స్టంట్‌ల అవసరం ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఇది మినహా అతని బీపీ, షుగర్‌ ఇతరత్రా అన్ని పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి’ అని డాక్టర్‌ సరోజ్‌ మండల్‌ వివరించారు.  

త్వరగా కోలుకోవాలని... 
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీసీఐ చీఫ్‌ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ క్రికెటర్లు, అతని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు. ‘సౌరవ్‌ గుండెపోటుకు గురవడం విచారకరం. త్వరితగతిన కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలి. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి’ అని బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ స్పందించారు.

గెట్‌ వెల్‌ సూన్‌ గంగూలీ. త్వరగా కోలుకోవాలని నా ప్రార్థన.    –భారత కెప్టెన్‌ కోహ్లి 

‘దాదా’ వేగంగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలి. అదే నేను కోరేది... ప్రార్థించేది.     –బీసీసీఐ కార్యదర్శి జై షా

‘దాదా’... మీరు త్వరలోనే కోలుకుంటారు. మీకు పూర్తి స్వస్థత చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా.    – వీరేంద్ర సెహ్వాగ్‌

సౌరవ్‌ నీ అనారోగ్యం గురించి తెలిసింది. ఇకపై గడిచే ప్రతి రోజు నిన్ను పూర్తి ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలని కోరుకుంటున్నా.     – సచిన్‌ టెండూల్కర్‌

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గుండెపోటుకు గురయ్యాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. మేమంతా అతను సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.     –ఐసీసీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top