టీమిండియా ప్లేయర్లకు బాబా సెహ్వాగ్‌ స్పెషల్ టిప్  

Sehwag Suggests Hilarious Way For Virat Kohli And Co To Counter James Anderson At Lords - Sakshi

లండన్‌: ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో స్వింగ్‌ కింగ్‌, ఇంగ్లండ్ వెటరన్‌ పేసర్‌ అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు నానా తిప్పలు పడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌కు మన వీరేంద్రుడు ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తే ఆండర్సన్‌ బౌలింగ్‌లో ఎవరూ అవుట్ కారని భరోసా ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మంత్రం ఏంటని అనుకుంటున్నారా..? అండర్సన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న వారంతా అతను బంతి పట్టుకొని పరుగెడుతూ క్రీజ్ వద్దకు రాగానే ఒకడుగు ముందుకు వేసి గట్టిగా 'జై భజరంగ్ బలి' అనే మంత్రం పఠించాలని, అప్పుడు పరుగులు రాకపోయినా ఔట్ అయితే కాకుండా బతికిపోతారని చెప్పుకొచ్చాడు. 

సెహ్వాగ్‌ ఇచ్చిన ఈ సలహాను ఆధారాలతో సహా సమర్ధించుకోవడం విశేషం. క్రీజ్‌ వదిలి ముందు కొచ్చి ఆడటం వల్ల క్లీన్ బౌల్డ్ కావడం గానీ.. లోపలికి వచ్చే బంతుల వల్ల ఎల్బీడబ్ల్యూ కావడం కానీ జరగదని చెప్పుకొచ్చాడు. గతంలో పుజారా, కోహ్లీలు మాత్రమే అండర్సన్‌ బౌలింగ్‌లో అవుటయ్యే వారని.. ఇప్పుడు రహానే కూడా ఆండర్సన్‌ రెగ్యులర్‌ కస్టమర్ల జాబితాలో చేరాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాబట్టి ఈ ముగ్గురు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆడేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. 

అయితే, సెహ్వాగ్ సలహా విని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కొందరైతే ఇది లగాన్ సినిమా నుంచి కాపీ చేసినట్లుందని కామెంట్లు చేస్తున్నారు. అందులో కూడా బ్రిటిష్ బౌలర్‌ను ఎదుర్కొనే ముందు పూజారి క్యారెక్టర్ వేసిన నటుడు 'జై భజరంగ్ బలి' అని అరుస్తాడు. అనంతరం బౌండరీలు కూడా బాదేస్తాడు. ఆ సీన్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, 39 ఏళ్ల వయసులో కూడా ఆండర్సన్‌ అదరగొడుతున్నాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. కీలక ఆటగాళ్లైన రోహిత్‌, పుజారా, రహానేల వికెట్లు తీసి టీమిండియాను భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరగులు చేసి ఆలౌటైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top