
హాంకాంగ్: ఈ ఏడాది తమ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ... భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆరో టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 20–22, 21–16తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.
64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్‌లో తడబడింది. 16–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేసింది.
అయితే మలేసియా జోడీ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలను మార్చి ఆడి పైచేయి సాధించారు. స్కోరు 6–5 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10–5తో ముందంజ వేశారు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
లక్ష్య సేన్‌దే పైచేయి...
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. భారత రెండో ర్యాంకర్ ఆయుశ్ శెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 66 నిమిషాల్లో 21–16, 17–21, 21–13తో విజయం సాధించి ఈ ఏడాది రెండో టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది 13 టోర్నీల్లో ఆడిన లక్ష్య సేన్ మకావ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్నాడు.