సాత్విక్‌–చిరాగ్‌ జోడీ క్వార్టర్‌ ఫైనల్లో విజయం | Satwik-Chirag Pair Win In Badmintan Quarterfinals | Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ప్రతీకార విజయం

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

Satwik-Chirag Pair Win In Badmintan Quarterfinals

క్వార్టర్‌ ఫైనల్లో జింగ్‌ కాంగ్‌–ఆరోన్‌ జంటపై గెలుపు

సింగపూర్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి

సింధు, లక్ష్య సేన్‌ ఇంటిముఖం

సింగపూర్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఆ దిశగా మరో అడుగు వేసింది. సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్నలో సాత్విక్‌–చిరాగ్‌ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఖాయ్‌ జింగ్‌ కాంగ్‌–ఆరోన్‌ తాయ్‌ (మలేసియా) ద్వయంతో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 19–21, 21–17, 21–13తో గెలుపొందింది.

ఈ విజయంతో ఖాయ్‌ జింగ్‌ కాంగ్‌–ఆరోన్‌ తాయ్‌లపై సాత్విక్‌–చిరాగ్‌ ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌íÙప్‌ తొలి రౌండ్‌లో ఖాయ్‌ జింగ్‌ కాంగ్‌–ఆరోన్‌ తాయ్‌ల చేతిలో ఎదురైన ఓటమికి లెక్క సరిచేశారు. 65 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో భారత జంట తొలి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో 3–8తో వెనుకబడి ఓటమి దిశగా పయనించింది. అయితే తమ తప్పిదాలను సరిచేసుకొని వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన భారత ద్వయం 9–8తో ఆధిక్యంలోకి వచ్చింది.

ఆ తర్వాత స్కోరు 16–16 వద్ద సాత్విక్‌–చిరాగ్‌ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ముందంజ వేశారు. అనంతరం ఒక పాయింట్‌ కోల్పోయినా, వెంటనే మరో పాయింట్‌ నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలో భారత జంట 8–4తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 8–8తో సమమైంది.

స్కోరు 10–9 వద్ద ఉన్నపుడు భారత జోడీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–9తో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం చివరకు గేమ్‌ను, మ్యాచ్‌ను 21–13తో దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ జోడీ కిమ్‌ వన్‌ హో–సియో సెంగ్‌ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్‌–చిరాగ్‌ జంట ఆడుతుంది.

సింధు తొమ్మిదో‘సారీ’ 
సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్ల కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సింధు 17–21, 14–21తో ఓడిపోయింది. ఆన్‌ సె యంగ్‌ చేతిలో సింధుకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆన్‌ సె యంగ్‌పై సింధు ఒక్క గేమ్‌ మాత్రమే గెలిచింది.

2023 ఆసియా చాంపియన్‌íÙప్‌లో ఆన్‌ సె యంగ్‌ చేతిలో మూడు గేముల్లో ఓడిన సింధు... మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా రెండు గేముల్లో పరాజయం రుచి చూసింది. కొకి వతనాబె (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ 19–21, 21–15, 15–21తో ఓడిపోయాడు. 2016 తర్వాత లక్ష్య సేన్‌పై వతనాబె రెండోసారి గెలిచాడు. ఈ పదేళ్ల కాలంలో వీరిద్దరి మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా... నాలుగింటిలోనూ లక్ష్య సేన్‌ విజయం సాధించాడు.

సెమీస్‌లో తనీషా–ధ్రువ్‌ ద్వయం 
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ నాలుగో ర్యాంక్‌ జంట చెన్‌ టాంగ్‌ జియె–టో ఈ వె (మలేసియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ధ్రువ్‌ తొలి గేమ్‌లో 16–18తో వెనుకబడ్డారు. ఈ దశలో మలేసియా ద్వయం గాయం కారణంగా వైదొలగడంతో భారత జోడీకి విజయం ఖరారైంది. నేడు జరిగే సెమీఫైనల్లో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్‌)లతో తనీషా–ధ్రువ్‌ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement