RCB Vs PBKS: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా | Royal Challengers Bangalore Beat Punjab Kings By 6 Runs In IPL Final, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

RCB Vs PBKS Highlights: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా

Jun 4 2025 3:11 AM | Updated on Jun 4 2025 11:08 AM

Royal Challengers Bangalore beat Punjab Kings by 6 runs in IPL final

ఐపీఎల్‌ కొత్త చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

తొలిసారి టైటిల్‌ సాధించిన జట్టు

ఫైనల్లో 6 పరుగులతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలుపు

రాణించిన కోహ్లి, కృనాల్‌ పాండ్యా  

ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్‌సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్‌ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్‌లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్‌సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్‌ నమ్‌దే’ (ఈ ఏడాది కప్‌ మనదే) జోక్‌గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్‌సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్‌ గర్వపడే క్షణం వచ్చేసింది...

తమ టీమ్‌లోని 18వ నంబర్‌ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. లీగ్‌ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరి తొలి క్వాలిఫయర్‌లోనే గెలుపుతో ఫైనల్‌ చేరిన టీమ్‌ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్‌లను అధిగమించి రాయల్‌గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్‌సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్‌ కోహ్లి కెరీర్‌లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది.  

అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీ చరిత్రలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్‌ మ్యాచ్‌లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్‌లో ‘ఈ సాల కప్‌ నమ్‌దు’ (ఈ ఏడాది కప్‌ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని ఆర్‌సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్‌ ఇన్‌గ్లిస్‌ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్‌ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు రన్నరప్‌ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్‌ చేరిన పంజాబ్‌ జట్టు తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.  

ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి.  

సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన... 
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్‌ సాల్ట్‌ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. 

మయాంక్‌ అగర్వాల్‌ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్‌ (15 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్‌ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్‌లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్  సింగ్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్‌సీబీ 3 వికెట్లు కోల్పోయింది.  

టపటపా... 
సీజన్‌ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (22 బంతుల్లో 26; 2 సిక్స్‌లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) పేలవ షాట్‌కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్‌లో దూకుడు ప్రదర్శించిన ఇన్‌గ్లిస్‌ను కృనాల్‌ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్‌ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్‌ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అయ్యర్‌ (బి) జేమీసన్‌ 16; కోహ్లి (సి అండ్‌ బి) అజ్మతుల్లా 43; మయాంక్‌ అగర్వాల్‌ (సి) అర్ష్ దీప్  (బి) చహల్‌ 24; పాటీదార్‌ (ఎల్బీ) (బి) జేమీసన్‌ 26; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) జేమీసన్‌ 25; జితేశ్‌ శర్మ (బి) వైశాక్‌ 24; షెఫర్డ్‌ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్  17; కృనాల్‌ (సి) అయ్యర్‌ (బి) అర్ష్ దీప్  4; భువనేశ్వర్‌ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్  1; యశ్‌ దయాళ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్‌: అర్ష్ దీప్  సింగ్‌ 4–0–40–3, జేమీసన్‌ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్‌ 4–0–30–1, యుజువేంద్ర చహల్‌ 4–0–37–1. 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్‌ (బి) హాజల్‌వుడ్‌ 24; ప్రభ్‌సిమ్రన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 26; ఇన్‌గ్లిస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కృనాల్‌ 39; అయ్యర్‌ (సి) జితేశ్‌ (బి) షెఫర్డ్‌ 1; నేహల్‌ వధేరా (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 15; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 61; స్టొయినిస్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) భువనేశ్వర్‌ 6; అజ్మతుల్లా (సి) (సబ్‌) భందగే (బి) యశ్‌ దయాళ్‌ 1; జేమీసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–38–2, యశ్‌ దయాళ్‌ 3–0–18–1, హాజల్‌వుడ్‌ 4–0–54–1, కృనాల్‌ పాండ్యా 4–0–17–2, సుయాశ్‌ శర్మ 2–0–19–0, షెఫర్డ్‌ 3–0–30–1.  

6 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్‌గా రజత్‌ పాటీదార్‌ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్‌ కింగ్స్‌; 5 సార్లు),  రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌; 5 సార్లు), గౌతమ్‌ గంభీర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; 2 సార్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; ఒకసారి), హార్దిక్‌ పాండ్యా (గుజరాత్‌ టైటాన్స్‌; ఒకసారి) ఈ ఘనత సాధించారు.

10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో 10 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్‌ చేసిన జట్టుకు టైటిల్‌ లభించింది.  

9 ఐపీఎల్‌–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్‌ సీజన్‌లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.

2 ముంబై ఇండియన్స్‌ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)తోపాటు ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ సాధించిన రెండో జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ గెలిచింది.

1 ఐపీఎల్‌ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్‌ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement