ఆర్‌సీబీకి అందిన ద్రాక్ష | Royal Challengers Bangalore are new champion of IPL 2025 | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీకి అందిన ద్రాక్ష

Jun 4 2025 3:18 AM | Updated on Jun 4 2025 8:04 AM

Royal Challengers Bangalore are new champion of IPL 2025

విరాట్‌ కోహ్లి 17 సీజన్లలో కలిపి 8 వేల పరుగులు చేసినా... క్రిస్‌ గేల్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో 7 సీజన్లలో రికార్డులు బద్దలు కొట్టినా... డివిలియర్స్‌ 11 సీజన్లలో మరచిపోలేని మెరుపు ప్రదర్శనలు చూపించినా సాధ్యం కాలేదు... ఈ ముగ్గురు కలిసి 7 సీజన్లలో టి20 క్రికెట్‌ మజా ఏమిటో చూపిస్తూ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచినా... అసలు లక్ష్యం మాత్రం అందనంత దూరంలో నిలిచిపోయింది... గేల్‌ ఎప్పుడో టీమ్‌కు దూరమయ్యాడు...

డివిలియర్స్‌ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితం తప్పుకున్నాడు...వీరిద్దరితో కలిసి ఐపీఎల్‌లో ఓవరాల్‌గా టాప్‌–2 భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లి... ఆ తర్వాత డుప్లెసిస్‌తో కలిసి మరో మూడు సీజన్లు బ్యాటింగ్‌ భారం మోశాడు. కానీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు వచ్చినా ఐపీఎల్‌ ట్రోఫీ మాత్రం దక్కలేదు! అయితే ఎట్టకేలకు బెంగళూరు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకుంది. కోహ్లి ఆనందభాష్పాలు చూస్తే ఈ విజయం విలువేమిటో తెలుస్తుంది! 

స్టార్లు కాకపోయినా.... 
పెద్ద పెద్ద పేర్లు ముఖ్యం కాదు... చిన్న ఆటగాళ్లే అయినా వారు చూపించే ప్రభావం ముఖ్యమని ఆర్‌సీబీ నిరూపించింది. టోర్నీలో పది మంది బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్‌కు ముందు జట్టు 10 మ్యాచ్‌లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లుగా నిలిచారు. ‘బిగ్‌ త్రీ’పై మాత్రమే ఆధారపడిన గెలుపును ఆశించిన జట్టులా ఈసారి బెంగళూరు ఏమాత్రం కనిపించలేదు.

వైవిధ్యంతో పాటు బ్యాటింగ్‌ లోతును కూడా టీమ్‌ చూపించింది. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆదుకున్నారు. లీగ్‌ దశలో పంజాబ్‌పై టిమ్‌ డేవిడ్, చెన్నైపై షెఫర్డ్, లక్నోపై జితేశ్‌ ఆడిన ఇన్నింగ్స్‌లు అసాధారణ ప్రదర్శనలుగా నిలిచాయి. ఐపీఎల్‌ చరిత్రలో ప్రత్యర్థి వేదికపై ఆడిన 7 మ్యాచ్‌లూ గెలిచిన తొలి జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.  

సాల్ట్‌ను ఎంచుకొని... 
ఐపీఎల్‌ వేలం సమయంలో టీమ్‌ డైరెక్టర్‌ బొబాట్‌ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘వారు ఎలా ఆడతారన్నది మేం ఆలోచించడం లేదు. మేం ఎలా ఆడించాలనే ఆలోచనే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే మేం ఆటగాళ్లను ఎంచుకున్నాం’ అని ఆయన చెప్పారు. 

హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్, మెంటార్‌ దినేశ్‌ కార్తీక్‌లతో పాటు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలు బెంగళూరుకు అద్భుతంగా పని చేశాయి. కోహ్లికి జోడీగా విధ్వంసకర ఓపెనర్‌ కావాలంటూ కార్తీక్‌ పట్టుబట్టి మరీ సాల్ట్‌ను రూ. 11.25 కోట్లకు తీసుకునేలా చేశాడు. ఏకంగా 175 స్ట్రయిక్‌రేట్‌తో అతను 403 పరుగులు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.  

కెప్టెన్‌ సూపర్‌... 
కెప్టెన్‌గా కూడా రజత పాటీదార్‌ను ఎంచుకోవడంలో ఆర్‌సీబీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. భారత్‌ క్రికెట్‌లో స్టార్‌ ఆటగాడు కాకపోయినా... ముస్తాక్‌అలీ ట్రోఫీలో అతని నాయకత్వ లక్షణాలు చూసి ఎంచుకుంది. ఇది ఎంత గొప్పగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోల్‌కతా, చెన్నై, ముంబైలపై వారి వేదికల్లో ఎన్నో ఏళ్ల తర్వాత విజయాలు సాధించడంలో బ్యాటర్‌గా పాటీదార్‌ పాత్ర ఎంతో ఉంది. 

312 పరుగులతో అతను రాణించాడు. సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాళ్‌లను సరైన సమయంలో సమర్థంగా వాడుకోవడంలో అతని కెప్టెన్సీ ప్రతిభ కనిపించింది. ఇప్పుడు 17 సీజన్లలో సాధ్యం కాని ఘనతను కెపె్టన్‌గా తన తొలి సీజన్‌లోనే అందుకొని పాటీదార్‌ ఐపీఎల్‌ చరిత్రలో తన పేరును ఘనంగా లిఖించుకున్నాడు.  

అంతా కోహ్లిమయం... 
బెంగళూరు టీమ్‌ సభ్యులలో గతంలో కృనాల్‌ పాండ్యా, హాజల్‌వుడ్, భువనేశ్వర్, సాల్ట్‌ ఐపీఎల్‌ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇతర యువ ఆటగాళ్ల కెరీర్‌ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు. ఇప్పటికిప్పుడు టైటిల్‌ గెలిచినా, ఓడినా వారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ విరాట్‌ కోహ్లి పరిస్థితి అందరికంటే భిన్నం. అతను 18 సీజన్లుగా ఒకే జట్టుకు తన సర్వం ధారబోశాడు. ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. 

కానీ టైటిల్‌ మాత్రం గెలవలేని లోటు ప్రతీసారి వెంటాడేది. గతంలో మూడు ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా 2016 సీజన్‌లో ఏకంగా 973 పరుగులతో చెలరేగినా ఫైనల్లో పరాజయం అతడికి తీవ్ర వేదనను కలిగించింది. నాటినుంచి ఇప్పటి వరకు మళ్లీ  జట్టు ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. 

కెరీర్‌ చరమాంకంలో ఉన్న అతను ఈసారి గెలవలేకపోతే మరింత ఆవేదన కలిగేది. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కోహ్లి కోసమే వచ్చినట్లుగా ఉంది. అందుకే మైదానమంతా కోహ్లి చుట్టే సంబరాలు. గతంలో జట్టులో భాగంగా ఉండి ట్రోఫీ గెలవలేని డివిలియర్స్, గేల్‌ కూడా కోహ్లి పక్కన ఉండి అతని సంతోషంలో భాగం కావడం విశేషం.  -సాక్షి క్రీడా విభాగం 

‘పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా’ 
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్‌ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్‌తో ఉన్నాను. ప్రతీ సీజన్‌లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. 

ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్‌ గెలవాలని కలగన్నాను. మరో టీమ్‌తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్‌ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. 

ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్‌ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోర్నీలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించాం.  –విరాట్‌ కోహ్లి    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement