విజయ్ హజారే ట్రోఫీ-2025లో ముంబై బ్యాటర్, కేకేఆర్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రఘువంశీ తలకు గాయమైంది. అంగ్క్రిష్ ఒక కష్టతరమైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు.
దీంతో అతడి తలకు, భుజానికి తీవ్రమైన గాయమైంది. రఘువంశీ విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన ఫిజియోలు అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తెసుకెళ్లారు. అనంతరం అతడిని జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్యులు స్కాన్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అతడి గాయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పలు రిపోర్ట్‌ల ప్రకారం.. రఘువంశీ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ అదే జరిగితే ముంబై జట్టుకే కాకుండా కేకేఆర్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బే. రఘువంశీ కేకేఆర్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో కేకేఆర్ 8వ స్థానంలో నిలిచినప్పటికీ.. రఘువంశీ మాత్రం దుమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్‌లలో 300 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతడు గాయపడడం కేకేఆర్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. హార్దిక్ తమోర్ (93*), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఉత్తరాఖండ్ తడబడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయితే రఘువంశీ మాత్రం కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.


