
చెన్నై: రోహిత్ రాయుడు 5 వికెట్లతో సత్తా చాటడంతో... బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. మొదట మధ్యప్రదేశ్ 56.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
ఆర్యన్ తివారీ (68 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెపె్టన్ శుభమ్ (25), అథర్వ్ మహాజన్ (20), మంగేశ్ యాదవ్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు 44 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకోగా... తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (121 బంతుల్లో 85 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి చేరువయ్యాడు.
నితీశ్ రెడ్డి (48 బంతుల్లో 41; 6 ఫోర్లు) అవుట్ కాగా... రాహుల్ రాధేశ్ (32 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది.
సర్ఫరాజ్ సెంచరీ...
భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (112 బంతుల్లో 111;9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. హరియాణాతో పోరులో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ చెలరేగడంతో ముంబై జట్టు 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. షమ్స్ ములానీ (82 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా... కెప్టెన్ తనుశ్ కొటియాన్ (60 బంతుల్లో 48; 3 పోర్లు, 1 సిక్స్) దివ్యాన్ష్ సక్సేనా (106 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ తమోర్ (73 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (66 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
ఒకదశలో ముంబై జట్టు 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో సర్ఫరాజ్ కౌంటర్ అటాక్‌తో సత్తాచాటాడు. గత మ్యాచ్‌లో తమిళనాడుపై సెంచరీ సాధించిన సర్ఫరాజ్... అదే జోరు ఇక్కడా కొనసాగించాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ (144 బంతుల్లో 133; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), అర్షిన్ కులకర్ణి (190 బంతుల్లో 146; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు బాదడంతో... హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 90 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో ప్రిన్స్ ఠాకూర్ 7 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్