
రన్నరప్ జట్టుకు రూ. 19 కోట్ల 70 లక్షలు
మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఊతమిచ్చే నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకుంది. ఈనెల 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు భారత్–శ్రీలంక వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో విజేతతో పాటు రన్నరప్, ఇతర నగదు పురస్కారాన్ని భారీగా పెంచింది. గత టోరీ్నతో పోలిస్తే మొత్తం ప్రైజ్‌మనీ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.
2025 వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచే జట్టుకు 48 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 42 లక్షలు) లభిస్తాయి. 2022 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఇది 239 శాతం ఎక్కువ కావడం విశేషం. ఫైనల్లో ఓడిన జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 70 లక్షలు) అందుకుంటుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 85 లక్షలు) చొప్పున లభిస్తాయి.
గ్రూప్ దశలో ప్రతి విజయానికి ఒక్కో జట్టు 34,314 డాలర్ల (రూ. 30 లక్షల 18 వేలు) చొప్పున అందుకుంటుంది. 5వ, 6వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 15 లక్షలు) చొప్పున... 7వ, 8వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 46 లక్షలు) చొప్పున ఇస్తారు. మొత్తంగా ఈ టోర్నీ కోసం 1 కోటీ 38 లక్షల 80 వేల డాలర్లు (రూ. 122 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీగా కేటాయించారు.
గత టోర్నీ ప్రైజ్‌మనీ 35 లక్షల డాలర్లతో పోలిస్తే ఏకంగా 297 శాతం పెరగడం పెద్ద విశేషం. రెండేళ్ల క్రితం భారత్‌లో జరిగిన పురుషుల వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇంతకంటే తక్కువ ప్రైజ్‌మనీనే (సుమారు రూ.88.26 కోట్లు) ఉంది. ‘మహిళల క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు పురుషులతో సమానంగా గుర్తింపు ఇవ్వడమే ఐసీసీ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈ భారీ ప్రైజ్‌మనీ పెంపుదలను నిర్ణయించాం. ఈ పెరుగుదల మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త మలుపుగా నిలిచిపోతుంది’ అని ఐసీసీ చైర్మన్ జై షా ప్రకటించారు.