ఆర్సీబీ భళా.. కేకేఆర్‌ డీలా | RCB Beat KKR By 82 Runs | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ భళా.. కేకేఆర్‌ డీలా

Oct 12 2020 11:13 PM | Updated on Oct 13 2020 3:41 PM

RCB Beat KKR By 82 Runs - Sakshi

షార్జా:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌లో ఛేదించే క్రమంలో కేకేఆర్‌ పూర్తిగా తేలిపోయింది. శుబ్‌మన్‌ గిల్‌(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించింది. కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. వాషింగ్టన్‌ సుందర్, మోరిస్‌లకు తలో‌ రెండు వికెట్లు సాధించగా, చహల్‌, ఉదాన, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీలకు ఒక్కో వికెట్‌ దక్కింది. సుందర్‌ నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులే ఇవ్వగా, చహల్‌ నాలుగు ఓవర్లకు 12 పరుగులిచ్చాడు. మోరిస్‌ నాలుగు  ఓవర్లకు 17 పరుగులివ్వగా, సైనీ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చాడు. (‘ఈ ఏడాదే టీమిండియాకు ఆడతాడు’)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రెండు  వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దేవదూత్‌ పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు,  1సిక్స్‌) అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), ఏబీ  డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి(33 నాటౌట్‌; 28 బంతుల్లో 1 ఫోర్‌)లు రాణించడంతో ఆర్సీబీ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు.  ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్‌ రొటేట్‌ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్‌లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్‌ ఔటైన తర్వాత గేమ్‌ స్వరూపం మారిపోయింది.

ఫించ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు.  బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్‌ ద వికెట్‌, రౌండ్‌ ద వికెట్‌ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ 190 పరుగుల మార్కును చేరింది. కాగా, కోహ్లి ఫోర్‌ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్‌లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్‌లో కోహ్లి సాధించాడు. కేకేఆర్‌ బౌలర్లలో రసెల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు తలో వికెట్‌ లభించింది.ఇది ఆర్సీబీకి ఐదో విజయం కాగా, కేకేఆర్‌కు మూడో ఓటమి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement