భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కంటే పంజాబ్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్, అయుశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్‌ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.
కాగా, అశ్విన్ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 248.24 స్ట్రయిక్‌రేట్‌తో 211 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్‌ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.
వైభవ్ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. సీఎస్‌కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్‌ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది.
అయితే ఇటీవల మ్యాచ్‌లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 236.54 స్ట్రయిక్‌రేట్‌తో 246 పరుగులు చేసి టాప్-5 లీడింగ్ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.
మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్ ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 201 పరుగులు చేసి సీఎస్‌కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మొత్తంగా అశ్విన్ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్‌తో పోలిస్తే వైభవ్‌కు అధిక హైప్ దక్కింది. టాలెంట్ విషయం పక్కన పెడితే, ఏజ్ అతనికి అడ్వాంటేజ్‌గా మారింది.
14-15 ఏళ్ల వయసులో వైభవ్ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు.


