చరిత్ర సృష్టించిన నాదల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో మెద్వెదెవ్‌పై సంచలన విజయం | Rafael Nadal Wins Australian Open 2022 Singles Title By Defeating Daniil Medvedev | Sakshi
Sakshi News home page

Australian Open Final: చరిత్ర సృష్టించిన నాదల్‌.. హోరాహోరి పోరులో మెద్వెదెవ్‌పై సంచలన విజయం

Jan 30 2022 7:46 PM | Updated on Jan 30 2022 8:03 PM

Rafael Nadal Wins Australian Open 2022 Singles Title By Defeating Daniil Medvedev - Sakshi

Rafael Nadal Wins Australian Open 2022 Singles Title: ఓపెన్‌ టెన్నిస్‌ ఎరాలో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 పురుషుల సింగల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

దాదాపు ఐదున్నర గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరిగా సాగిన ఈ పోరులో నదాల్‌ తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ.. అనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్‌, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్‌.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. మరోవైపు కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌పై గంపెడాశలు పెట్టుకున్న మెద్వెదెవ్‌.. నాదల్‌ అనుభవం ముందు నిలబడ లేకపోయాడు. మెద్వెదెవ్‌.. 2021లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గాడు.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ టైటిల్‌ను టాప్‌ సీడ్‌ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్‌ రిపబ్లిక్‌) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్‌ హద్దాద్‌ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. అంతకుముందు పురుషుల డబుల్స్‌ ఫైనల్లో థనాసి కొకినాకిస్‌-నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్‌–పర్సెల్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన విషయం తెలిసిందే. 


చదవండి: చెక్‌ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement