ఆ ఒక్క ఓవర్‌.. ముంబై ఓటమికి ప్రధాన కారణం అదే! | R Ashwin Lambasts Hardik Pandya Over Bizarre Captaincy Call Vs RCB | Sakshi
Sakshi News home page

చెత్త కెప్టెన్సీ.. ముంబై ఓటమికి ప్రధాన కారణం అదే!

Apr 13 2026 11:48 AM | Updated on Apr 13 2026 12:03 PM

R Ashwin Lambasts Hardik Pandya Over Bizarre Captaincy Call Vs RCB

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో హార్దిక్‌ సేన 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా వరుసగా మూడో ఓటమితో హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసింది.

చెత్త కెప్టెన్సీనే కారణమని
ఈ నేపథ్యంలో ముంబై ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం స్పందించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై ఓటమికి హార్దిక్‌ పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమని ఘాటుగా విమర్శించాడు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్‌ రజత్ పాటిదార్‌ క్రీజులో ఉన్న వేళ హార్దిక్‌ ఎంచుకున్న బౌలింగ్‌ ఆప్షన్లు సరికాదని పేర్కొన్నాడు.

స్పిన్‌ హిట్టర్‌ అని తెలిసీ.. 
ఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్‌తో 2024 నాటి మ్యాచ్‌ సందర్భంగా రజత్‌ పాటిదార్‌ తాను స్పిన్‌ హిట్టర్‌నని నిరూపించుకున్నాడు. మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు బాదాడు. ఇ​క ఇప్పుడు కూడా అంతే.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ముంబై స్పిన్నర్‌ మార్కండే పన్నెండో ఓవర్లో బౌలింగ్‌కు దిగగా.. విరాట్‌ కోహ్లి తొలుత సింగిల్‌ తీశాడు. ఆ తర్వాత రజత్‌ పాటిదార్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. అక్కడే 18 పరుగులు రాబట్టాడు.

ఆ ఒక్క ఓవర్‌..
ఈ ఓవర్‌ విజయాన్ని నిర్దేశించడంలో కీలకంగా మారింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌ హిట్టింగ్‌ ఆడగలడు. అలాంటిది అతడు బ్యాటింగ్‌కు రాగానే మార్కండేనే ఎందుకు రంగంలోకి దించినట్లు? ఇదైతే తెలివైన నిర్ణయం కానేకాదు.

అసలు మార్కండే ఏం ఆలోచిస్తున్నాడో హార్దిక్‌ తెలుసుకున్నాడా? హైదరాబాద్‌లో గతంలో అతడి బౌలింగ్‌ను పాటిదార్‌ ఉతికి ఆరేశాడు. ఇక్కడ కూడా మొదటి బంతి నుంచే అటాకింగ్‌ మొదలుపెట్టాడు. ఇక ముంబై మరో స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లోనూ ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టారు.

83 పరుగులు
ఇద్దరు స్పిన్నర్లు మార్కండే, సాంట్నర్‌ కలిసి ఏకంగా 83 పరుగులు ఇచ్చుకున్నారు. ఇందులో సాంట్నర్‌వి 43. వీరిద్దరి వైఫల్యం వల్లే ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది’’ అని అశ్విన్‌ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ సరిగ్గా లేదని విమర్శించాడు. కాగా వాంఖడే వేదికగా ముంబైతో మ్యాచ్‌లో పాటిదార్‌ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు సాధించాడు.

ఇక ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (36 బంతుల్లో 78), విరాట్‌ కోహ్లి 38 బంతుల్లో (50).. టిమ్‌ డేవిడ్‌ (16 బంతుల్లో 34 నాటౌట్‌) కూడా అదరగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 222 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement