పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ ఆకాంక్ష
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో గత ఏడాది టైటిల్ సాధించేందుకు చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి దూసుకొచ్చిన పంజాబ్‌ను తుది పోరులో ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పొరపాటుకు తావు ఇవ్వమని, కచ్చితంగా ట్రోఫీని అందుకుంటామని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన బెంగళూరు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
‘మే 31న చిన్నస్వామి మైదానంలో మేం ఫైనల్ ఆడి కప్‌ను సొంతం చేసుకోబోతున్నాం. ఇది నా ఆశ మాత్రమే కాదు. కచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఉంది. టీమ్ సభ్యులందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది కాబట్టి జట్టు మొత్తం కూడా ఇదే నమ్ముతోంది’ అని శశాంక్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది ఫైనల్ గురించి ఆలోచిస్తూ తాము ఒత్తిడి పెంచుకోమని, ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యమని అతను పేర్కొన్నాడు. 2025 సీజన్‌లో ఆడిన జట్టు నుంచి 21 మంది పంజాబ్ కింగ్స్ కొనసాగిస్తోంది.
‘గత ఏడాది చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించడం ముఖ్యం. దాదాపు అదే జట్టు ఉండటం కూడా అందరిలో ప్రేరణ కలిగించే అంశం. ఈ సీజన్‌కు మేం మరింత బాగా సన్నద్ధమై వచ్చాం’ అని శశాంక్ వెల్లడించాడు. సాధారణంగా టాపార్డర్ బ్యాటర్ అయిన తాను పంజాబ్ కింగ్స్ జట్టు అవసరాల కోసం ఆర్డర్‌లో దిగువకు మారానని...అయితే ఈ పాత్రను, బాధ్యతను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు.
ఫిట్‌నెస్ టెస్టులో తుషారా విఫలం
ఐపీఎల్‌కు అనుమతించని శ్రీలంక బోర్డు
కొలంబో: ఐపీఎల్‌లో ఇప్పటికే హాజల్‌వుడ్ అందుబాటులో లేక పేస్ బౌలింగ్‌లో డీలాగా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి మరో సమస్య తోడైంది. హాజల్‌వుడ్ స్థానంలో తుది జట్టులో ఆడే అవకాశం ఉన్న శ్రీలంక పేసర్ నువాన్ తుషారా ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో తుషారా విఫలమయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ కోసం ఎన్‌ఓసీ ఇచ్చేందుకు లంక బోర్డు తిరస్కరించింది. ఫిట్‌నెస్ టెస్టులో వేర్వేరు ప్రమాణాల ద్వారా అందుబాటులో ఉన్న 29 పాయింట్లలో కనీసం 17 పాయింట్లు సాధించాల్సి ఉండగా... తుషారా వాటిని అందుకోలేకపోయాడు.


