ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అరంగేట్రం పేసర్లు ప్రఫుల్ హింగే (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ముఖ్యంగా హింగే పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసి రాయల్స్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
తొలి ఓవర్‌లో హింగే ఔట్ చేసిన ముగ్గురు బ్యాటర్లు (వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, ప్రిటోరియస్) డకౌట్ కావడం విశేషం. వీరిలో వైభవ్ వికెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌పై అతి భారీ అంచనాలు ఉండేవి. ఈ సీజన్‌లో అతను తొలి మ్యాచ్ నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై దండయాత్ర తప్పదని అంతా అనుకున్నారు.
అయితే వైభవ్ విషయంలో హింజ్ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను అతను రెండో బంతికే ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హింగే సంధించిన అద్భుతమైన డెలివరీ కారణంగా వైభవ్ గోల్డెన్ డకౌటయ్యాడు. హింగే వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో బంతి వైభవ్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ సలీల్ అరోరా చేతుల్లోకి వెళ్లింది.
వైభవ్ వికెట్‌పై మ్యాచ్ అనంతరం హింగే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందే ప్లాన్ చేశాను. వైభవ్‌కి బౌన్సర్ వేసి ఔట్ చేస్తానని 2–3 మందికి చెప్పాను. నా తొలి మ్యాచ్‌లో నాలుగైదు వికెట్లు తీస్తానని గతేడాదే రాసుకున్నాను. పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపుతానని ఊహించాను. అదే నిజమైంది అని అన్నాడు.
హింగే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతని అరంగేట్రంపై ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ప్లాన్ ప్రకారమే వైభవ్‌ను ఔట్ చేసిన విషయమూ తెలుస్తుంది. తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్న హింగే రాబోయే మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు కీలక బౌలర్‌గా మారిపోయాడు. రాత్రిరాత్రే స్టార్ డమ్ సంపాదించి హీరో హైప్ తెచ్చుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, ఇషాన్ కిషన్ (91) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ను రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) ఆదుకున్నారు. ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది.


