
తమ కీలక బ్యాటర్లు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వీరిద్దరికి మరోసారి మొండిచేయి చూపింది. సల్మాన్ ఆఘా (Salman Ali Agha)ను కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు.. షాదాబ్ ఖాన్‌ను అతడికి డిప్యూటీగా నియమించారు.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బాబర్‌తో పాటు రిజ్వాన్ కూడా తేలిపోయాడు. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పొటి ఫార్మాట్ సిరీస్‌లలో కూడా పాక్ జట్టు నిరాశపరిచింది.
షాహిన్ ఆఫ్రిదికి కూడా షాక్
ఇక న్యూజిలాండ్ టూర్‌కు బాబర్, రిజ్వాన్‌లను ఎంపిక చేయని పీసీబీ... సల్మాన్ ఆఘాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, అతడి సారథ్యంలో పాక్ కివీస్ చేతిలో 4-1తో చిత్తుగా ఓడింది. దీంతో సీనియర్లను తిరిగి పిలిపిస్తారని విశ్లేషకులు భావించారు. కానీ సెలక్టర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌ల ఆశలపై నీళ్లు చల్లారు. వీరితో పాటు పేసర్ షాహిన్ ఆఫ్రిదికి కూడా షాకిచ్చారు.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పీసీబీ తాజాగా జట్టును ప్రకటించింది. పదహారు మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి వాళ్లకు చోటు దక్కింది. ఇక సిరీస్‌తో మైక్ హెసన్ పాకిస్తాన్ కొత్త కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.
వరల్డ్‌కప్‌లోనూ ఆడించరా?
కాగా 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగానే బంగ్లాదేశ్‌తో పాక్ ఈ సిరీస్ ఆడుతోంది. అంటే.. బాబర్ ఆజం, రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిదిలను పక్కనపెట్టడం ద్వారా.. ఈ మెగా టోర్నీకి కూడా వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదనే సంకేతాలు ఇచ్చింది.
ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు పాకిస్తాన్ సూపర్ లీగ్ -2025 ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ చెప్పడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్‌తో పాక్ ఆడబోయే మూడు టీ20 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదిక.
ఇక వన్డేల్లో మాత్రం మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడి సారథ్యంలో ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గెలుపన్నదే లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఐసీసీ టైటిల్‌ను రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హ్యారీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీం షా, సాహిబ్‌జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సయీమ్ ఆయుబ్.
చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్‌కే కెప్టెన్ రియాక్షన్ వైరల్