ఐపీఎల్-2026 సీజన్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఊహించిన దానికంటే ముందే జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో తొలి మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మంగళవారం బెంగళూరులో అడుగుపెట్టనుంది.
అయితే కమ్మిన్స్ కూడా నేడే బెంగళూరుకు చేరుకోనున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా కమ్మిన్స్ గత కొంత కాలంగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్-2026 నుంచి కూడా తప్పుకొన్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2026 సీజన్‌లో కూడా ఫస్ట్ హాఫ్‌కు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
దీంతో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఇషాన్ కిషన్‌కు అప్పగించింది. కానీ ఇప్పుడు కమ్మిన్స్ ముందుగానే భారత్‌కు చేరుకుంటుండటం ఆరెంజ్ ఆర్మీకి భారీ ఊరట కలిగించే ఆంశంగా చెప్పాలి.
కమ్మిన్స్ తుది జట్టులో ఉంటాడా?
అయితే కమిన్స్ ముందుగానే వచ్చినా.. మార్చి 28న ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మార్చి 25న ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల అధికారిక సమావేశానికి ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఇషాన్ కిషన్ హాజరుకానున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
దీని బట్టి కమ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు కిషన్ జట్టు నడిపించనున్నాడని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికి కమ్మిన్స్ జట్టుతో కలవడం ఎస్ఆర్‌హెచ్ కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ప్రాక్టీస్‌లో కానీ, మ్యాచ్ సమయంలో కానీ కమ్మిన్స్ తన అనుభవాన్ని పంచుకోనున్నాడు.
మరోవైపు శ్రీలంక స్పీడ్‌స్టార్ ఎషాన్ మలింగ కూడా ఎస్ఆర్‌హెచ్ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ ఎన్‌వోసీ మంజూరు చేసింది. ఇప్పుడు కమ్మిన్స్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారనుంది.
ఎస్ఆర్‌హెచ్ జట్టు
బ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్
ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి
బౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి


