త్వరలో మనమే నంబర్‌ వన్‌: పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ | Not far : Mohsin Naqvi claims PSL will beat IPL World No. 1 league claim | Sakshi
Sakshi News home page

IPL కాదు!.. PSL నంబర్‌ వన్‌: పీసీబీ చీఫ్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌

Apr 6 2026 12:26 PM | Updated on Apr 6 2026 12:38 PM

Not far : Mohsin Naqvi claims PSL will beat IPL World No. 1 league claim

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. భారత్‌లో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ లీగ్‌కు.. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఆదరణ కూడా ఎక్కువే! ఐపీఎల్‌ మీడియా హక్కులు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడుపోయాయంటే ఈ లీగ్‌కు ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

65 శాతం తక్కువ
మరోవైపు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 2016లో మొదలైంది. ఇప్పటికీ ఈ లీగ్‌ అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది. ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో ఆడుతూ ఉంటారు. పీఎస్‌ఎల్‌ మీడియా హక్కుల 93 మిలియన్‌ డాలర్లకు మించలేదు. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది దాదాపుగా 65 శాతం తక్కువ. ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్‌ఎల్‌ నాలుగు సీజన్లకు సమానం.

తమదే గొప్ప లీగ్‌ అంటూ
అయినప్పటికీ చాలా మంది పాక్‌ మాజీ క్రికెటర్లు పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ.. తమదే గొప్ప లీగ్‌ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ లీగ్‌గా
‘‘ప్రస్తుతం పెట్టుబడిదారులకు పీఎస్‌ఎల్‌ అత్యుత్తమ మార్కెట్‌గా పరిణమించింది. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ లీగ్‌ అయ్యేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పీఎస్‌ఎల్‌ గవర్నర్ల సమావేశంలో నక్వీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే పీఎస్‌ఎల్‌ను మొదలుపెడుతున్న పీసీబీకి చేదు అనుభవాలే మిగులుతున్నాయి.

ఐపీఎల్‌ క్రేజ్‌ ముందు పీఎస్‌ఎల్‌ వెలవెలబోతూ ఉన్నా పీసీబీ వైఖరి మాత్రం మారడం లేదు. అంతేకాదు.. ఈసారి పరిస్థితి మరీ పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలపై ప్రభావం పడగా.. పాక్‌లో తీవ్ర సంక్షోభం నెలకొంది.

ఆశకైనా హద్దుండాలి
ఫలితంగా కేవలం రెండు వేదికల్లో ప్రేక్షకులు లేకుండానే పీఎస్‌ఎల్‌ను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అనతికాలంలోనే ఈ లీగ్‌ నంబర్‌ వన్‌ అవుతుందంటూ నక్వీ చేసిన వ్యాఖ్యలపై.. ఆశకైనా హద్దు ఉండాలి కదా! అంటూ సోషల్‌ మీడియా సెటైర్లు పేలుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పాకిస్తాన్‌కు ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో కనీసం సెమీస్‌ చేరకుండానే ఇంటి బాట పట్టిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీ ఫైనల్‌ చేరకుండానే నాకౌట్‌ అయింది. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటనలో పదకొండేళ్ల తర్వాత ఆతిథ్య జట్టుకు తొలిసారి వన్డే సిరీస్‌ కోల్పోయింది.

చదవండి: Sanju Samson: ‘ఇష్టం లేక‌పోతే త‌ప్పుకో’.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement