
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.
ఈ క్రమంలో తొలుత హాంకాంగ్‌తో తలపడిన అఫ్గన్ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టిన రషీద్ ఖాన్ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ చేసింది.
తప్పక గెలిస్తేనే..
నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్ సూపర్-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్‌లో తప్పక గెలిస్తేనే.. రషీద్ బృందానికి సూపర్-4 ఆశలు సజీవంగా ఉంటాయి.
మా స్థాయి ఇది కాదు
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.
చెత్త బ్యాటింగ్ వల్లే ఓటమి
అనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.
టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.
శ్రీలంకతో మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్ పోరుకు అబుదాబి వేదిక.
బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ స్కోర్లు
బంగ్లాదేశ్: 154/5 (20)
అఫ్గనిస్తాన్: 146 (20)
చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..
Bangladesh win, keeping playoff hopes alive 🤞
Group B battles are going down the wire.
Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/9mHoLUcTGw— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025