వెల్లింగ్టన్ వేదికగా సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
కివీస్ ఆరంభంలోనే సుజీ బేట్స్(0), ప్లిమ్మర్(1), అమీలియా కెర్(0) వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 211 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
మ్యాడీ గ్రీన్ (128 బంతుల్లో15 ఫోర్లతో 141 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తాచాటగా.. హాలిడే (98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయాండా హ్లూబి, తుమి సెఖుఖునే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నడైన్ డిక్లార్క్, మలబా చెరో వికెట్ సాధించారు.
అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(69) టాప్ స్కోరర్‌గా నిలవగా..అన్నెరీ డెర్క్సెన్(47), ట్రయన్(29) ఫర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు రెండు కూడా మాడీ గ్రీన్‌కే దక్కాయి.


