చరిత్ర సృష్టించిన నేపాల్‌ బ్యాటర్‌ | Kushal Bhurtel Joins Elite Club With Six Sixes In An Over As Nepal Posts Record 313 Against China In T20 Qualifier | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన నేపాల్‌ బ్యాటర్‌

May 31 2026 12:32 PM | Updated on May 31 2026 3:02 PM

Nepal Kushal Bhurtel hits six sixes, joins Yuvraj Singh, Herschelle Gibbs

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటైన "ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు" బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

భుర్టెల్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో హెర్షల్‌ గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, కీరన్‌ పోలార్డ్‌, జస్కరన్‌ మల్హోత్రా, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా భుర్టెల్‌ వీరి సరసన చేరాడు.

పురుషుల ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ (మే 31) జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భుర్టెల్ చైనా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 

ముఖ్యంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో Zhuoyue Chen వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

భుర్టెల్ కేవలం ఆరు సిక్సర్లతోనే ఆగిపోలేదు. మొత్తం 43 బంతుల్లోనే 129 పరుగులు చేసి చైనా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 సిక్సర్లు నమోదయ్యాయి. అనంతరం Deng Jinqi అతన్ని ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

భుర్టెల్‌కు తోడుగా కుషాల్‌ మల్లా 47 బంతుల్లో 85 పరుగులు, రోహిత్‌ పౌడెల్‌ కేవలం 21 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి చెలరేగారు. ఫలితంగా నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 313 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది.

314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు చైనా బ్యాటింగ్ కుప్పకూలింది. చైనా జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. Zheng Shenjian 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు.

కాగా, సింగపూర్‌ వేదికగా జరుగుతున్న పురుషుల ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్వాలిఫయర్-2026 టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడుతున్నాయి. నేపాల్‌, చైనా, ఖతార్‌, మలేసియా ఓ గ్రూప్‌-ఏలో ఉండగా.. బెహ్రెయిన్‌, హాంగ్‌కాంగ్‌, ఒమన్‌, సింగపూర్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement