
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు.
‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్‌ను వాయిదా వేశాం. ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.