National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..

National Games 2022: Neha Dagar Mother of Twin Toddlers Ready For Ragbi - Sakshi

భార్యాభర్తలు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవనసహచరులు ఒకరికొకరు అండగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. భారత రగ్బీ క్రీడాకారుల జంట నేహా పర్దేశీ- గౌతమ్‌ దాగర్‌ ఈ కోవకే చెందుతారు.

భారత రగ్బీ జట్ల మాజీ కెప్టెన్లు అయిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి 2019, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రణయ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేహా- గౌతమ్‌​ జీవితంలోని సంతోషాలను రెట్టింపు చేస్తూ గతేడాది నవంబరులో వీరికి కవలలు జన్మించారు. తమ కలల పంటకు దెమీరా దాగర్‌(కూతురు), కబీర్‌ దాగర్‌(కొడుకు)గా నామకరణం చేశారు ఈ క్రీడా దంపతులు.


(Photo Credit: Gautam Dagar Facebook)

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సిజేరియన్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేహా.. తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ ‍క్రీడల్లో భాగంగా ఈ ‘సూపర్‌ మామ్‌’ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్‌ వేదికగా 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన ఆరంభ వేడుకల సంబరం అంబరాన్నంటింది. 

36 క్రీడాంశాలు..
దాదాపుగా 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఈ ఆటల పండగను ప్రారంభించారు. జాతీయ క్రీడలు- 2022లో భాగంగా సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు.

ఇందులో నేహా కూడా ఒకరు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రగ్బీ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ.. సిజేరియన్‌ తర్వాత 20 రోజులకే ట్రెయినింగ్‌ ఆరంభించానంటూ ఆట పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు.

ఆత్మవిశ్వాసం కోల్పోను
‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు నా ఆటలో కాస్త వేగం తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ మానసికంగా నేనెంతో దృఢంగా ఉన్నాను. క్రీడాకారిణిగా నా బాధ్యతలను గతంలో కంటే మెరుగ్గా నెరవేర్చగలను. ఎందుకంటే.. నాకిపుడు మల్టీటాస్కింగ్‌ అలవాటైంది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా చూసుకుంటూనే తిరిగి రగ్బీ ఆడేందుకు సిద్ధమయ్యాను. సిజేరియన్‌ తర్వాత 20 రోజులకే ఫిజికల్‌ ట్రెయినింగ్‌ మొదలు పెట్టాను. 

ఫిట్‌నెస్‌ సాధించాను. తల్లిగా.. ప్లేయర్‌గా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని నేను పూర్తి ఆస్వాదిస్తున్నా’’ అని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 29 ఏళ్ల నేహా చెప్పుకొచ్చారు. తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా 2019లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన నేహా.. శుక్రవారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీకి సన్నద్ధమయ్యారు.  ఇక నేహా భర్త గౌతమ్‌ దాగర్‌ గతంలో భారత పురుషుల రగ్బీ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. 

చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top