
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. ఇటవలి కాలంలో షాంటో పొట్టి ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగానే అతన్ని టీ20 జట్టు నుంచి తప్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు షాంటో ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ లోపే అతన్ని జట్టు నుంచే తప్పించారు.
షాంటో ప్రస్తుత శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. అయినా అతన్ని టీ20 జట్టు నుంచి తొలగించారు. షాంటో గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగా అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి.
షాంటో గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అనంతర పరిణామాల్లో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదిలి పెట్టాడు.
జులై 10 నుంచి శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జులై 4) ప్రకటించారు. ఈ జట్టులో షాంటోతో పాటు మరో ఐదుగులు స్థానాలు కోల్పోయారు. పాకిస్తాన్‌తో చివరిగా ఆడిన జట్టులో సభ్యులైన సౌమ్య సర్కార్, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం, నహీద్ రాణా, ఖలీద్ అహ్మద్ లంకతో సిరీస్‌కు ఎంపిక కాలేదు.
ఆల్‌రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. జులై 10, 13, 16 తేదీల్లో పల్లెకెలె, డంబుల్లా, కొలొంబో వేదికలుగా శ్రీలంకతో మూడు టీ20లు జరుగనున్నాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు..
లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహ్మద్ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్.