అక్షరాలా రూ. 7 కోట్లు

Nadal wears most expensive watch ever worn on tennis court - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ ధరించిన రిస్ట్‌ వాచ్‌ విలువ

పారిస్‌: అగ్రశ్రేణి క్రీడాకారులు తమ ఆటతోపాటు తమ అలంకారాలతో కూడా అందరి దృష్టిని ఆకర్షించడం కొత్త కాదు. ఇప్పుడు ఇదే జాబితాలో టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ కూడా చేరాడు. 20వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకుపోతున్న నాదల్‌ తన కుడిచేతికి ధరించిన గడియారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ చేతి గడియారం ఖరీదు ఏకంగా 10 లక్షల 50 వేల డాలర్లు (సుమారు రూ. 7 కోట్ల 67 లక్షలు)  కావడం విశేషం. ఇంత ఖరీదైన రిస్ట్‌ వాచ్‌ను ఒక టెన్నిస్‌ ఆటగాడు గతంలో ఎప్పుడూ ధరించలేదు.

ప్రతిష్టాత్మక కంపెనీ ‘రిచర్డ్‌ మిల్లే’ నాదల్‌తో తమకు ఉన్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వాచీని ప్రత్యేకంగా తయారు చేసింది. ‘ఆర్‌ఎం 27–04 టోర్బిలాన్‌ రాఫెల్‌ నాదల్‌’ పేరుతో సదరు కంపెనీ ఇలాంటి 50 చేతి గడియారాలను మాత్రమే రూపొందించి మార్కెట్‌లో ఉంచింది. టైటాకార్బ్‌ టెక్నాలజీతో కార్ల తయారీలో వాడే మెటీరియల్‌ను దీనికి ఉపయోగించారు. అదీ ఇది అని కాకుండా సాంకేతికపరంగా లెక్కలేనన్ని ప్రత్యేకతలు ఈ గడియారంలో ఉన్నాయన్న రిచర్డ్‌ మిల్లే... నాదల్‌లాంటి దిగ్గజం మణికట్టుకు ఇది కనిపించడం తమకు గర్వకారణమని పేర్కొంది.  

ఆట ఓడాక ఆనందం...
‘చాలా అద్భుతంగా ఉంది’, ‘నా జీవితంలో కచ్చితంగా ఇదే అత్యుత్తమ క్షణం’... సాధారణంగా ఇలాంటి మాటలు విజేతగా నిలిచిన ఆటగాడి నోటి నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఒక మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే ఆశ్చర్యపడాల్సిందే. అమెరికా యువ ఆటగాడు సెబాస్టియన్‌ కోర్డా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో రాఫెల్‌ నాదల్‌ చేతిలో ఓడిన ఇలాంటి ‘తన్మయత్వానికి’ గురయ్యాడు. అందుకు కారణం అతను చిన్ననాటి నుంచి నాదల్‌ వీరాభిమాని కావడమే. ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటంటే నాదల్‌ మాత్రమే. అతను ఏ టోర్నీలో ఆడినా, ఎవరితో తలపడినా ప్రతీ మ్యాచ్‌ను నేను చూశాను. నా పిల్లికి కూడా అతని పేరే పెట్టుకున్నాను. అలాంటిది క్లే కోర్టులో అతనికి ప్రత్యర్థిగా ఆడగలనని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నాకు మరచిపోలేని మధుర క్షణం’ అని 20 ఏళ్ల సెబాస్టియన్‌ చెప్పాడు. సెబాస్టియన్‌ తండ్రి పెటర్‌ కోర్డా 1998లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలవగా, 1992 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు వచ్చాడు. అయినా సరే నాదల్‌ అంటేనే సెబాస్టియన్‌ పడి చస్తాడు. అందుకే మ్యాచ్‌ ముగిసిన తర్వాత నేరుగా నాదల్‌ వద్దకే వెళ్లి అడిగి మరీ టీ షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకొని సంబరపడిపోయాడు. మరోవైపు సెబాస్టియన్‌ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని నాదల్‌ ఆకాంక్షించాడు.

సెబాస్టియన్‌ కోర్డా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top