Mitchell Starc-Buttler: 'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి'

టీమిండియా బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్(రనౌట్) చేయడంపై ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. బంతి విడవకముందే చార్లీ క్రీజు దాటడంతో దీప్తి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బెయిల్స్‌ను ఎగురగొట్టింది. మన్కడింగ్ చట్టబద్ధం కావడంతో అంపైర్ చార్లీ డీన్‌ను ఔట్‌గా ప్రకటించారు. కాగా దీప్తి చర్యపై క్రికెట్ ప్రేమికులు రెండుగా చీలిపోయారు. దీప్తి శర్మ చేసిందని క్రీడాస్పూర్తికి విరుద్ధమని కొందరు పేర్కొంటే.. నిబంధనల ప్రకారమే దీప్తి నడుచుకుందంటూ మరికొంత మంది పేర్కొన్నారు. ఏది ఏమైనా దీప్తి చర్యపై ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం సమయం దొరికినప్పుడల్లా తప్పుబడుతూనే ఉన్నారు.
తాజాగా ఇంగ్లండ్ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దీప్తి శర్మ చర్యను పరోక్షంగా తప్పుబట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మూడో టి20 మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఐదో ఓవర్‌లో స్టార్క్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బట్లర్ క్రీజు దాటాడు. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం రనౌట్ చేయకుండా బట్లర్‌ను హెచ్చరికతో వదిలిపెట్టాడు.
ఆ తర్వాత రనప్‌కు వెళ్తూ.. ''నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'' అంటూ పేర్కొన్నాడు. అంపైర్‌తో పాటు బట్లర్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రికెట్ చరిత్రలో అశ్విన్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. అంతేకాదు రెండుసార్లు మన్కడింగ్ అయిన ఆటగాడిగా బట్లర్ నిలవడం గమనార్హం.
టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాను సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మూడో టి20కి వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. కెప్టెన్ జాస్ బట్లర్ 41 బంతుల్లో 65 పరుగులు నాటౌట్ రాణించాడు. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆట నిలిచిపోయే సమయానికి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
SOUND 🔛
What do you think about this event between Mitchell Starc and @josbuttler? 🤔#JosButtler #MitchellStarc #AUSvENG #SonySportsNetwork pic.twitter.com/rA3D5yxwFP
— Sony Sports Network (@SonySportsNetwk) October 14, 2022
చదవండి: భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వారం ముందే ఎలా చెప్తారు!
మరిన్ని వార్తలు