ఆ తప్పిదమే మా కొంపముంచింది: ఆసీస్‌ కెప్టెన్‌ | Mitchell Marsh Breaks Silence After Team India's Victory By 48 Runs At Carrara Oval, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఆ తప్పిదమే మా కొంపముంచింది: ఆసీస్‌ కెప్టెన్‌

Nov 7 2025 8:37 AM | Updated on Nov 7 2025 11:25 AM

Mitchell Marsh breaks silence after Team India's victory by 48 runs at Carrara Oval

సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 20 సిరీస్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘోర పరాజయం పాలైంది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధిం​చే ‍క్రమంలో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. 

కెప్టెన్‌ మిచెల్ మార్ష్‌ (24 బంతుల్లో 30; 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్‌ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 91/3తో సునాయసంగా గెలిపించేలా కన్పించిన కంగారులు తర్వాతి 28 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది.

ఇక నాలుగో టీ20లో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బ్యాటింగ్‌లో వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యమని మార్ష్ చెప్పుకొచ్చాడు.

"ఈ పిచ్‌పై 168 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించవచ్చు అనుకున్నాను. కానీ బ్యాటింగ్‌లో మాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఛేజింగ్‌లో మాకు లభించిన ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాము. మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాము.

మిడిల్ ఓవర్లలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. క‌చ్చితంగా క్రెడిట్ భార‌త బౌల‌ర్లకు ఇవ్వాల్సిందే. వారు కండీష‌న్స్‌కు త‌గ్గట్టు బౌలింగ్ చేసి మా ప‌తనాన్ని శాసించారు. భార‌త్ ఒక వ‌ర‌ల్డ్ క్లాస్ జ‌ట్టు. ఫార్మాట్ ఏదైనా, ప‌రిస్థితులు ఎలా ఉన్నా అందుకు త‌గ్గ‌ట్టు రాణించే స‌త్తా వారికి ఉంది. 

ప్రతీ మ్యాచ్‌లోనూ మా పూర్తి స్థాయి జట్టుతో బ‌రిలోకి దిగాల‌ని కోరుకుంటాం. కానీ యాషెస్ సిరీస్ కార‌ణంగా కొంత‌మంది కీల‌క ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇవ్వాల‌నుకున్నాము. అంతేకాకుండా ప్ర‌పంచ‌క‌ప్ దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్ల​కు అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఆఖరి మ్యాచ్‌లో కూడా మా ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మార్ష్ పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్.. భార‌త్-పాక్ మ్యాచ్ ఎక్క‌డంటే?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement