
ఉత్కంఠ పోరులో ఓటమి
3 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ గెలుపు
ముంబై: ఐపీఎల్–2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు.
వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. అనంతరం గుజరాత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
బుమ్రా, బౌల్ట్ చెలరేగిపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్ కుదించి డక్‌వర్త్–లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
స్కోరు వివరాలు:
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 2; రోహిత్ (సి) ప్రసిధ్ (బి) అర్షద్ 7; జాక్స్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 53; సూర్యకుమార్ (సి) షారుఖ్ (బి) సాయికిషోర్ 35; తిలక్ (సి) గిల్ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్ (బి) సాయికిషోర్ 1; నమన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 7; బాష్ (రనౌట్) 27; చహర్ (నాటౌట్) 8; కరణ్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్: సిరాజ్ 3–0–29–1, అర్షద్ 3–0–18–1, ప్రసిధ్ 4–0–37–1, సాయికిషోర్ 4–0–34–2, రషీద్ ఖాన్ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5; గిల్ (బి) బుమ్రా 43; బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 28; షారుఖ్ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ ఖాన్ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్ (బి) చహర్ 12; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–1, బౌల్ట్ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కరణ్ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్ 4–0–28–2, జాక్స్ 1–0–15–0.