
ఆర్సీబీ ఆటగాడు, టీమిండియా వెటరన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ త్వరలో ఇంగ్లండ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టనున్నాడు. 3 మ్యాచ్‌ల స్వల్పకాలిక ఒప్పందంలో భాగంగా యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2025లో భాగంగా సెప్టెంబర్ 8న సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌తో మయాంక్ కౌంటీ అరంగేట్రం చేస్తాడు. 34 ఏళ్ల మయాంక్‌కు ఇదే తొలి కౌంటీ ఒప్పందం.
యార్క్‌షైర్‌తో స్వల్పకాలిక డీల్ తర్వాత మయాంక్ భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతాడు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. మయాంక్ చివరిగా ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో మయాంక్ ఛాంపియన్‌గా అవతరించింది.
దేవ్‌దత్ పడిక్కల్‌కు ప్రత్యామ్నాయంగా సీజన్ మధ్యలో జాయిన్ అయిన మయాంక్.. ఆర్సీబీ టైటిల్ సాధించే క్రమంలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌పై ఫైనల్లో ఆడిన 24 పరుగుల ఇన్నింగ్స్ అందులో ఒకటి.
మయాంక్ టీమిండియా తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లవుతుంది. చివరిగా 2022 మార్చిలో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మయాంక్ భారత్ తరఫున 21 టెస్ట్‌లు ఆడి 41.3 సగటున 4 సెంచరీలు, 6 అర్ద సెంచరీల సాయంతో 1488 పరుగులు చేశాడు. 5 వన్డేల్లో 86 పరుగులు చేశాడు. మాయంక్ ఐపీఎల్ కెరీర్ ఘనంగా ఉంది. 131 మ్యాచ్‌ల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీల సాయంతో 2756 పరుగులు చేశాడు.