ఔను... నేనింతే! 

Marodona The Genius And The Controversy Of  The Argentina Football Hero - Sakshi

డీగో అంటే సాకర్‌ మాంత్రికుడు... 

డీగో అంటే మత్తువీడని వ్యసనపరుడు... 

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (60) బుధవారం గుండెపోటుతో కన్నుమూశాడు. కొంత కాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్న మారడోనా తుది శ్వాస విడిచాడు. దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరుగాంచిన మారడోనా ఎప్పుడూ మత్తులోనే తేలేవాడు. (మరో ప్రపంచానికి మారడోనా)

ఇందులో మొదటిది ఫుట్‌బాల్‌ ప్రపంచానికి రారాజును చేస్తే... రెండోది అతని వృత్తి (కెరీర్‌), వ్యక్తిగత జీవితాన్ని దిగజార్చింది. మ్యాచ్‌లో గోల్స్‌... జీవితానికి సరిపడా (సెల్ఫ్‌ గోల్స్‌) మరకలు అంటించుకున్నాడు. ఆట ఆరంభించినట్లుగానే మాదకద్రవ్యాలను స్వీకరించడం మొదలుపెట్టాడు. కెరీర్‌ తొలినాళ్లలోనే డ్రగ్స్‌ తీసుకున్నాడు. తర్వాత్తర్వాత అలవాటు చేసుకున్నాడు. అటుమీదట మత్తువీడని వ్యసనపరుడిగా మారిపోయాడు. రెండేళ్లలోనే ఈ మత్తు కోసమే నపోలికి వెళ్లాడు. అక్కడే కొమొర్రా మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఫుట్‌బాల్‌పై మారడోనా పట్టుసాధిస్తే... అతనిపై మత్తు పైచేయి సాధించింది. తదనంతరం అతని ఆరోగ్యం దెబ్బతింది. 

 1982లో తొలిసారి డ్రగ్స్‌ తీసుకున్నాడు.  
 రెండేళ్లలోనే (1984) ఆ డ్రగ్స్‌ అతన్ని తన చేతుల్లోకి తీసుకుంది. 
 తర్వాత రెండు దశాబ్దాలపైగానే మారడోనతో సావాసం చేసింది. 
 1991లో కొకైన్‌ తీసుకున్నట్లు తేలడంతో 15 నెలల నిషేధం. 
 అదే ఏడాది బ్యూనస్‌ఎయిర్స్‌లో ఏకంగా అరకేజీ కొకైన్‌తో అరెస్ట్‌ 
 ఈసారి 14 నెలల నిషేధం. 
 1994 జట్టులోకి తిరిగొచ్చాడు. గ్రీస్‌పై చేసిన గోల్‌తో సాకర్‌ మాంత్రికుడయ్యాడు.  
 మళ్లీ మత్తు చిత్తు చేసింది. 15 నెలలు వేటు పడింది. దీంతోనే అతని అంతర్జాతీయ కెరీర్‌ ముగిసింది. 
 1995లో బోకా జూనియర్స్‌ క్లబ్‌ పంచన చేరినా అక్కడా డ్రగ్స్‌ వీడలేదు. 
 ఈ ఆరేళ్లలోనే మూడుసార్లు నిషేధానికి గురవడంతో క్లబ్‌ ఆటకు తెరపడింది. 
 ఆ మరుసటి ఏడాదే (1996) ‘ఔను... నేనొక వ్యసనపరుడి’నని స్వయంగా ప్రకటించాడు. 
 2000 ఏడాది మితిమీరిన మత్తువాడకం (ఓవర్‌ డోస్‌) ఆస్పత్రిపాలు చేసింది. 
 2004లో గుండెపోటు. 
 2005లో గ్యా్రస్టిక్‌ బైపాస్‌ సర్జరీ. 2007లో హెపటైటిస్‌. 
 మొత్తానికి మత్తువీడాడు. కానీ మద్యానికి అలవాటుపడ్డాడు.   

సాకర్‌ మేధావి... నీకిదే మా నివాళి.. 

‘నా హీరో, మేధావి ఇక లేడు. మారడోనా కోసమే నేను ఫుట్‌బాల్‌ చూసేవాణ్ని. అతని మరణవార్త నన్ను బాధించింది’ 
–బీసీసీఐ చీఫ్, మాజీ కెప్టెన్‌ గంగూలీ 

‘డీగో ఫుట్‌బాల్‌ దేవుడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ 
–భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఎం.విజయన్‌ 

‘ఫుట్‌బాలే కాదు... యావత్‌ క్రీడా ప్రపంచమే ఓ అత్యుత్తమ ఆటగాడిని కోల్పోయింది. మేమంతా నిన్ను మిస్సవుతున్నాం మారడోనా’ 
– సచిన్‌ టెండూల్కర్‌ 

‘సాకర్‌లో మేటి ఆటగాడు డీగో. తను ఇక లేడనే వార్త క్రీడాప్రపంచానికి బాధకరమైంది. తన కుటుంబసభ్యులు, 
శ్రేయోభిలాషులు, అభిమానులకు నా ప్రగాఢసానుభూతి’ 
– వీవీఎస్‌ లక్ష్మణ్‌ 

‘నిస్సందేహంగా డీగో ఆల్‌టైమ్‌ దిగ్గజం. ఈ వార్త నన్ను దిగ్భ్రాంతి పరిచింది. భారమైన హృదయంతో నివాళి.’ 
–మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top