IND vs SL: టీమిండియా ఆటగాళ్ల రికార్డుల మోత.. ఆసక్తికర విషయాలు

Many Records Broken India Vs Sri Lanka 2nd T20 Match Dharmashala - Sakshi

టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. మ్యాచ్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. వాస్తవానికి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పాతుమ్‌ నిస్సాంక(75), దాసున్‌ షనక(47 నాటౌట్‌) రాణించడంతో 183 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన  టీమిండియా 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. శ్రేయాస్‌ అయ్యర్‌ 74 నాటౌట్, రవీంద్ర జడేజా 45 నాటౌట్‌ రాణించారు. ఇక మ్యాచ్‌లో బద్దలయిన రికార్డులేంటో పరిశీలిద్దాం.

టి20 చరిత్రలో రోహిత్‌ శర్మను అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా దుష్మంత చమీరా నిలిచాడు. రోహిత్‌ను.. చమీరా ఇప్పటివరకు ఐదుసార్లు ఔట్‌ చేశాడు. టిమ్‌ సౌథీ నాలుగు సార్లు ఔట్‌ చేసి రెండో స్థానంలో.. ఇష్‌ సోది, జాసన్‌ బెండార్ఫ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ , జునియర్‌ దాలాలు మూడేసిసార్లు రోహిత్‌ను ఔట్‌ చేశాడు. 


శ్రీలంకతో రెండో టి20లో విజయం టీమిండియా వరుసగా 11వ గెలుపు కావడం విశేషం. ఇంతకముందు అఫ్గనిస్తాన్‌(2018-19లో)- 12 విజయాలు, రొమానియా(2020-21)-12 విజయాలు, అఫ్గనిస్తాన్‌(2016-17లో)- 11 విజయాలు, ఉగాండ(2021లో) 11 విజయాలు సాధించాయి.
స్వదేశంలో టి20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకోవడం ఇది 12వ సారి. ఇప్పటివరకు సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా ఎప్పుడు కోల్పోలేదు. 


ఇక టి20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు స్వదేశంలో 16వ విజయం. తద్వారా స్వదేశంలో ఒక జట్టు కెప్టెన్‌గా అ‍త్యధిక విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. కేన్‌ విలియమ్సన్‌, ఇయాన్‌ మోర్గాన్‌(చెరో 15 విజయాలు)లను రోహిత్‌  అధిగమించాడు. 
టి20ల్లో శ్రీలంకపై టీమిండియా గెలవడం ఇది 16వ సారి. ఇంతకముందు జింబాబ్వేపై పాకిస్తాన్‌ 16 విజయాలతో తొలి స్థానంలో ఉంది. మూడో వన్డేలోనూ టీమిండియా లంకపై విజయం సాధిస్తే.. ఒక జట్టుపై అధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్‌ నిలవనుంది.


టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టి20ల్లో అత్యధిక స్కోరు సాధించాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇంతకముందు టి20ల్లో జడేజాకు అత్యధిక స్కోరు 44గా ఉంది. ఇక శ్రేయాస్‌ అయ్యర్‌(74 నాటౌట్‌) కూడా టి20ల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
టి20ల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న టీమిండియా ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్‌ టి20ల్లో 50 క్యాచ్‌లు అందుకున్నాడు. రోహిత్‌ తర్వాత కోహ్లి 43, రైనా 42 క్యాచ్‌లతో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top