KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్‌’తో...

Kolkata beat Delhi to set up a summit clash with Chennai - Sakshi

ఐపీఎల్‌ ఫైనల్లో నైట్‌రైడర్స్‌

ఉత్కంఠ పోరులో ఢిల్లీపై 3 వికెట్లతో గెలుపు

మూడో స్థానంతో నిష్క్రమించిన క్యాపిటల్స్‌

రేపు చెన్నైతో కోల్‌కతా తుది పోరు  

136 పరుగుల స్వల్ప లక్ష్యం...ఓపెనర్లే 96 పరుగులు జోడించి గెలుపు దిశగా నడిపించారు... ఒకదశలో చేతిలో 9 వికెట్లు ఉండగా 25 బంతుల్లో 13 పరుగులు చేస్తే చాలు... కానీ కోల్‌కతా ఒక్కసారిగా తడబడింది. 7 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగా, 23 బంతుల్లో 7 పరుగులే వచ్చాయి. నలుగురు డకౌట్‌! ఢిల్లీ క్యాపిటల్స్‌లో విజయంపై ఆశలు... చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే త్రిపాఠి నైట్‌రైడర్స్‌ను గట్టెక్కించాడు.

అశ్విన్‌ వేసిన ‘రసగుల్లా’లాంటి ఐదో బంతిని సిక్సర్‌గా మలచి ఏడేళ్ల విరామం తర్వాత మాజీ చాంపియన్‌ను మూడోసారి ఫైనల్‌కు చేర్చాడు. గత ఏడాది ఫైనల్లో ఓడిన ఢిల్లీ ఇప్పుడు నిరాశగా మూడో స్థానంతో ముగించింది. మూడుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్, గతంలో ఫైనల్‌ చేరిన రెండుసార్లూ (2012, 2014) విజేతగా నిలిచిన కోల్‌కతా మధ్య శుక్రవారం ఫైనల్‌ జరగనుండటంతో ఈ ఏడాదీ ఐపీఎల్‌లో కొత్త చాంపియన్‌ లేకపోవడం ఖాయమైంది.  

షార్జా: మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు.

సమష్టి వైఫల్యం...
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో 6 లేదా అంతకంటే తక్కువ పరుగులు చేసిన సందర్భాలున్నాయి. టి20 మ్యాచ్‌లో ఒక జట్టు ఓడిపోవడానికి ఇలాంటి పేలవ ప్రదర్శన చాలు! మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఇలాంటి ఆటతోనే ఓటమిని ఆహా్వనించింది. పిచ్‌ ఎంత నెమ్మదిగా ఉన్నా, స్పిన్‌కు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నా కూడా ఒక్క బ్యాటర్‌ కూడా ఎదురుదాడికి దిగి ధాటిగా ఆడే ప్రయత్నం చేయకపోవడంతో ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. తొలి 4 ఓవర్ల వరకు క్యాపిటల్స్‌ ప్రదర్శన మెరుగ్గా సాగింది. షకీబ్‌ ఓవర్లో పృథ్వీ వరుసగా 6, 4 కొట్టగా... నరైన్‌ వేసిన వరుస బంతుల్లో ధావన్‌ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇది చూస్తే ఒక హోరాహోరీ పోరుకు తెర లేచినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతే కేకేఆర్‌ బౌలర్ల ఆధిపత్యం ముందు ఢిల్లీ తేలిపోయింది. వరుణ్‌ తన తొలి బంతికే పృథ్వీ షాను అవుట్‌ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు.  

ఓపెనర్ల జోరు...
ఢిల్లీ చేసిన తప్పును కోల్‌కతా చేయలేదు. పిచ్‌ స్వభావంపై దృష్టి పెట్టకుండా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి నుంచి దూకుడు కనబర్చింది. ముఖ్యంగా వెంకటేశ్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. అశ్విన్‌ ఓవర్లో ఫోర్‌తో జోరు ప్రారంభించిన అతను అక్షర్‌ బౌలింగ్‌లో రెండు, రబడ ఓవర్‌లో ఒక సిక్సర్‌ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 51 పరుగులకు చేరింది. మరో ఎండ్‌లో గిల్‌ ప్రశాంతంగా ఆడగా... 38 బంతుల్లోనే వెంకటేశ్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు వెంకటేశ్‌ను రబడ అవుట్‌ చేసి ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడదీసినా కోల్‌కతా విజయం అప్పటికే దాదాపుగా ఖాయమైనట్లు అనిపించింది. అయితే అనూహ్య మలుపులతో డ్రామా సాగి చివరకు మరో బంతి మిగిలి ఉండగా నైట్‌రైడర్స్‌ గెలుపు తీరం చేరింది.  

స్కోరు వివరాలు  
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (ఎల్బీ) (బి) వరుణ్‌ 18; ధావన్‌ (సి) షకీబ్‌ (బి) వరుణ్‌ 36; స్టొయినిస్‌ (బి) మావి 18; శ్రేయస్‌ (నాటౌట్‌) 30; పంత్‌ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్‌ 6; హెట్‌మైర్‌ (రనౌట్‌) 17; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1–32, 2–71, 3–83, 4–90, 5–117.
బౌలింగ్‌: షకీబ్‌ 4–0–28–0, ఫెర్గూసన్‌ 4–0–26–1, నరైన్‌ 4–0–27–0, వరుణ్‌ 4–0–26–2, మావి 4–0–27–1.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 46; వెంకటేశ్‌ (సి) (సబ్‌) స్మిత్‌ (బి) రబడ 55; రాణా (సి) హెట్‌మైర్‌ (బి) నోర్జే 13; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 12; కార్తీక్‌ (బి) రబడ 0; మోర్గాన్‌ (బి) నోర్జే 0; షకీబ్‌ (ఎల్బీ) (బి) అశి్వన్‌ 0; నరైన్‌ (సి) అక్షర్‌ (బి) అశి్వన్‌ 0; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10, మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 136.
వికెట్ల పతనం: 1–96, 2–123, 3–125, 4–126, 5–129, 6–130, 7–130.
బౌలింగ్‌: నోర్జే 4–0–31–2, అశి్వన్‌ 3.5–0–27–2, అవేశ్‌ ఖాన్‌ 4–0–22–1, అక్షర్‌ పటేల్‌ 4–0–32–0, రబడ 4–0–23–2.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top