 
													రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు.
ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే.
తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్‌మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్.
సీఎస్‌కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨
— IndianPremierLeague (@IPL) March 25, 2024
King Kohli is off the mark in the chase and how 😎
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి.
ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
