KL Rahul: రిపోర్టర్‌​ ప్రశ్నకు చిర్రెత్తిన రాహుల్‌.. 'డగౌట్‌లో కూర్చోమంటున్నారా?'

KL Rahul Irritated By Reporter Question Kohli As Opener Further Matches - Sakshi

ఆసియాకప్‌ టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు వెళ్లడంలో విఫలమైనప్పటికి అఫ్గన్‌పై భారీ విజయంతో టోర్నమెంట్‌ను ముగించింది. విరాట్‌ కోహ్లి వీరోచిత సెంచరీకి తోడు భువనేశ్వర్‌ బౌలింగ్‌లో మెరవడంతో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉండడంతో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడపించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కేఎల్‌ రాహుల్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు. ఇంటర్య్వూ సాఫీగా సాగుతున్న వేళ ఒక రిపోర్టర్‌ అడిన ప్రశ్న కేఎల్‌ రాహుల్‌కు చికాకు తెప్పించింది. దీంతో కాస్త కటువుగా రిపోర్టర్‌కు సమాధానం ఇవ్వడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు విషయానికి వస్తే.. రోహిత గైర్హాజరీలో మ్యాచ్‌లో కోహ్లి.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశాడు. ఓపెనర్‌గా అదరగొట్టిన కోహ్లి.. ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్‌ రాహుల్‌కు ఒక ప్రశ్న సంధించాడు.'' విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చి ఐదు సెంచరీలు బాదాడు. తాజాగా ఆసియాకప్‌లో అఫ్గన్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఒక వైస్‌ కెప్టెన్‌గా కోహ్లిని ఓపెనర్‌గా ట్రై చేస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్‌కు సలహా ఇస్తారా.. టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరగనున్న టి20 సిరీస్‌లకు కోహ్లినే ఓపెనర్‌గా ఉంటాడా?'' అని అడిగాడు. రిపోర్టర్‌ ప్రశ్న విన్న కేఎల్‌ రాహుల్‌.. ''మీరు నన్ను డగౌట్‌లో కూర్చోమని పరోక్షంగా సలహా ఇస్తున్నారా.. అమేజింగ్‌'' అంటూ చురకలంటించాడు.

ఆ తర్వాత రాహుల్‌ మాట్లాడుతూ.. ''ఇక కోహ్లి సెంచరీ చేయడం మాకు బోనస్‌ లాంటిది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమి పాలైన తర్వాత జట్టు మీద ఒత్తిడి ఉండడం సహజం. పైగా మా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో కెప్టెన్‌గా నాపై బాధ్యత పెరిగింది. మంచి స్కోరు చేయాలని భావించాను. అందుకు తగ్గట్లే కోహ్లితో సమన్వయం కుదిరింది. ఈరోజు మ్యాచ్‌ నిస్సందేహంగా కోహ్లిదే. కాగా ఈ విజయాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నాం. రాబోయే టి20 ప్రపంచకప్‌కు ఈ విజయాలను కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నా'' అంటూ ముగించాడు.

చదవండి: Kohli-KL Rahul: రోహిత్‌ లేకుంటే ఫ్రీ హ్యాండ్‌ తీసుకుంటారా!

Virat Kohli-Anushka Sharma: 'మై లవ్‌.. నేను ఎప్పటికి నీతోనే'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top