జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: ఆసీస్‌ క్రికెటర్‌ | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌పై ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ప్రశంసలు

Published Thu, Dec 3 2020 3:16 PM

KL Rahul Gesture Will Remember Forever Says Cameron Green - Sakshi

కాన్‌బెర్రా: టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ చూపిన చొరవను తానెన్నటికీ మరచిపోలేనన్నాడు ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌‌ కామెరూన్‌ గ్రీన్‌. రాహుల్‌ చాలా మంచివాడంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా స్థానిక మనుకా ఓవల్‌ మైదానంలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో కోహ్లి సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ చేజారినప్పటికీ చివరి మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా టీమిండియా తదుపరి టీ20, టెస్టు సిరీస్‌కు ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంది. (చదవండి: నటరాజన్‌ అరంగేట్రం.. అద్భుతమైన కథ!)

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నటరాజన్‌ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. కామరూన్‌ గ్రీన్‌ జాతీయ జట్టుకు తొలిసారి(వన్డే)గా ప్రాతినిథ్యం వహించాడు. 230వ ఆటగాడిగా స్టీవ్‌ స్మిత్‌ నుంచి క్యాప్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన 21 ఏళ్ల కామెరూన్‌ 27 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్‌ తీయలేకపోయాడు. ఇక లక్ష్యఛేదనలో భాగంగా ఐదో స్థానంలో బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన అతడు 27 బంతుల్లో 21 పరుగులు(1 ఫోర్‌, 1 సిక్స్‌) చేశాడు. కాగా తాను బ్యాటింగ్‌ వచ్చిన సమయంలో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ తనను రిసీవ్‌ చేసుకున్న విధానం ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌ అనంతరం కామెరూన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఒత్తిడికి లోనవుతున్నావా అని తను నన్ను అడిగాడు అనుకుంటా. అవును .. కాస్త నెర్వస్‌గా ఫీల్‌ అవుతున్నా అని నేను సమాధానమిచ్చా. ఇందుకు బదులుగా.. మరేం పర్లేదు.. బాగా ఆడు యంగ్‌స్టర్‌ అన్నట్లుగా ఉత్సాహపరిచాడు.  బౌలింగ్‌ చేస్తున్న సమయంలో విరాట్‌ నాతో ఏదో అనడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఫించీ తనకు బదులిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాలను నేనెప్పటికీ మరచిపోలేను’’ అని అరంగేట్ర అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. 

Advertisement
Advertisement