లక్నో జట్టులో ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ | Josh Inglis joins LSG squad, Breetzke leaves IPL 2026 for personal reasons | Sakshi
Sakshi News home page

లక్నో జట్టులో ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌

May 1 2026 9:39 PM | Updated on May 1 2026 9:38 PM

Josh Inglis joins LSG squad, Breetzke leaves IPL 2026 for personal reasons

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 6 పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లక్నోకు ఓ ఊరట కలిగించే వార్త అందింది. ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ తాజాగా జట్టులో చేరాడు.

ఇంగ్లిస్‌ను లక్నో ఈ సీజన్‌ వేలంలో రూ. 8.6 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ.. వివాహం కారణంగా అతను సీజన్‌ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేకపోయాడు. ఇంగ్లిస్‌ పెళ్లి ఏప్రిల్‌ 18న స్వదేశంలో జరిగింది. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన ఇంగ్లిస్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 162.57 స్ట్రయిక్‌రేట్‌తో 278 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ప్రస్తుతమున్న డూ ఆర్‌ డై పరిస్థితుల్లో ఇంగ్లిస్‌ సత్తా చాటితే లక్నోకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లక్నో మే 4న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లిస్‌ అందుబాటులో ఉంటాడు.

బ్రీట్జ్కే నిష్క్రమణ
ఓ పక్క ఇంగ్లిస్‌ జట్టుకు అందుబాటులో రాగా.. మరో లక్నో ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రీట్జ్కే తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.

లక్నో ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ, సీఎస్‌కే (2 సార్లు), రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఇలాంటి దశలో ఇంగ్లిస్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ జట్టుకు అందుబాటులోకి రావడం లక్నోకు శుభపరిణామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement