WI vs SA: వెస్టిండీస్‌ క్రికెటర్‌ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!

Johnson Charles For Fastest T20I Hundred By West Indies Player - Sakshi

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కింగ్‌ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్‌.. మొదటి బంతి నుంచే ప్రోటీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్‌.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

చార్లెస్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్‌ క్రికెటర్‌గా చార్లెస్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది.  2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్‌ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్‌ రికార్డు బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన విండీస్‌ క్రికెటర్‌గా  చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్‌ 117 పరుగులు సాధించాడు.

ఇక ప్రపంచ క్రికెట్‌లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్‌ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
విండీస్‌ భారీ స్కోర్‌
ఇక చార్లెస్‌ అద్భుత ఇన్నింగ్స​ ఫలితంగా విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది.  చార్లెస్‌తో పాటు ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రోటీస్‌ బౌలరల్లో జానెసన్‌ మూడు వికెట్లు,పార్నెల్‌ రెండు వికెట్లు సాధించారు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top