ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను.. 

It Took About Ten Days To Convince Sourav Ganguly To Let Dhoni Play For East Zone Says Kiran More - Sakshi

ముంబై: టీమిండియా స‌క్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కోసం నాటి ఈస్ట్‌ జోన్‌ సారధి సౌరవ్‌ గంగూలీని పది రోజుల పాటు బతిమాలానని భారత మాజీ సెల‌క్షన్ క‌మిటీ చైర్మన్ కిర‌ణ్ మోరే వెల్లడించాడు. 2003-04 దులీప్ ట్రోఫీ ఫైన‌ల్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దీప్‌దాస్ గుప్తా బ‌దులు ధోనీని ఆడించేందుకు చాలా ప్రయాస‌ప‌డ్డానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ, దీప్‌దాస్‌ గుప్తా ఇద్దరు బెంగాల్‌కు చెందిన వారే అని తెలిసి కూడా గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నించానని, చివరకు గంగూలీ ఒప్పుకోవడం.. ధోనీ జట్టులోకి రావడం చకచకా జరిగిపోయాయని పేర్కొన్నాడు. 

అంతకుముందు ఓ స్నేహితుడు చెప్పడంతో ధోనీ ఆటను చూడటానికి తాను ప్రత్యక్షంగా వెళ్లానని, ఆ మ్యాచ్‌లో జట్టు మొత్తం 170 పరుగులు చేస్తే, ధోని ఒక్కడే 130 పరుగులు సాధించాడని మోరే తెలిపాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లపై ధోనీ విరుచుకుపడిన తీరు చూసి చాలా ముచ్చటేసిందని, అందుకే అతన్ని దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్ జోన్ త‌ర‌ఫున ఎలాగైనా ఆడించాల‌ని కంకణం కట్టుకున్నాని వివరించాడు. ఎట్టకేలకు గంగూలీని ఒప్పించాక ఫైనల్స్‌ బరిలో దిగిన ధోనీ తొలి ఇన్నింగ్స్‌లో 21 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడన్నాడు. 

దీంతో ఆ వెంట‌నే ధోనీని ఇండియా ఎ త‌ర‌ఫున కెన్యాలో జ‌రిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించామని, ఆ టోర్నీయే అతని కెరీర్‌ను మ‌లుపు తిప్పింద‌ని మోరే చెప్పుకొచ్చాడు. అందులో ధోనీ ఏకంగా 600 ప‌రుగులు సాధించి, జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడని వెల్లడించాడు. ఆ స‌మ‌యంలో (2003 వన్డే ప్రపంచకప్‌ తర్వాత) టీమిండియాకు రెగ్యుల‌ర్ వికెట్ కీప‌ర్ లేకపోవడం ధోనీకి మరింత కలిసొచ్చిందని, అందివచ్చిన అవకాశాలకు అతను ఒడిసి పట్టుకుని భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగాడంటూ ధోనీపై మోరే ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి నాటి చీఫ్‌ సెలక్టర్‌ మోరే చాలా సహయపడ్డాడని ధోనీ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. 
చదవండి: ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top