ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను 146 పరుగులకే (20 ఓవర్లు) కుప్పకూల్చారు. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ తీశారు.
హాజిల్‌వుడ్ తీసింది ఓ వికెటే అయినా అత్యంత పొదుపుగా (4-0-20-1) బౌలింగ్ చేసి ఆర్సీబీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కోహ్లి 49 పరుగులతో రాణించాడు.
సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్‌కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తన గాయం (knee injury)పై అప్‌డేట్ ఇచ్చాడు. మోకాలి నొప్పితో ఇంకా ఇబ్బందిగానే ఉందని అన్నాడు. అయితే గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త బెటర్ అని తెలిపాడు. గేమ్ ఫినిష్ చేయాలనుకున్నా, పిచ్ స్లో కావడంతో కాస్త కష్టమైందని వివరించాడు.


