SRH తుదిజట్టులో ఊహించని బౌలర్‌.. 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ! | IPL 2026 SRH vs RR: Predicted Playing XI SRH need to get rid of Them | Sakshi
Sakshi News home page

SRH తుదిజట్టులో ఊహించని బౌలర్‌.. 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!?

Apr 13 2026 12:51 PM | Updated on Apr 13 2026 1:07 PM

IPL 2026 SRH vs RR: Predicted Playing XI SRH need to get rid of Them

PC: BCCI

వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడి సన్‌రైజర్స్‌ వెనుకబడగా.. నాలుగింటికి నాలుగూ గెలిచి రాజస్తాన్‌ జోరు మీదుంది.

కమిన్స్‌ లేనిలోటు తెలుస్తోంది
కాబట్టి టేబుల్‌ టాపర్‌ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గెలవాలంటే సన్‌రైజర్స్‌ తీవ్రంగా శ్రమించకతప్పదు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై మంచి స్కోరు సాధించినా రైజర్స్‌ నిలబెట్టుకోలేకపోయింది.  రెగ్యులర్‌ కెప్టెన్‌, ప్రధాన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ లేనిలోటు మరోసారి స్పష్టంగా కనిపించింది.

బౌలర్ల ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్‌ 219 పరుగులు చేయగా.. పంజాబ్‌ 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు జయదేవ్‌ ఉనాద్కట్‌ (3 ఓవర్లలో 40), ఇషాన్‌ మలింగ (3 ఓవర్లలో 46), నితీశ్‌ రెడ్డి (2 ఓవర్లలో 20 పరుగులు) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.

దారుణ ప్రదర్శన
శివాంగ్‌ కుమార్‌ (3 ఓవర్లలో 33) మెరుగ్గా రాణించి మూడు వికెట్లు తీయగా.. హర్ష్‌ దూబే (4 ఓవర్లలో 38) ఒక వికెట్‌ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు కూర్పులో.. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంలో మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు గత మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఉనాద్కట్‌ 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చుకోగా.. నితీశ్‌ రెడ్డి ఇంచుమించు అదే స్థాయిలో బౌలింగ్‌ చేశాడు. అయితే, బ్యాటర్‌గా మాత్రం ఈ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన బాగుంది. దీంతో నితీశ్‌ రెడ్డి తుదిజట్టులో పదిలంగా ఉండటం ఖాయం.

నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ?
అయితే, ఉనాద్కట్‌ను రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేసి.. ఆటను మెరుగుపరుచుకునేలా సమయం ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అతడికి బదులు టీమిండియాకు ఆడిన శివం మావిని రంగంలోకి దించితే.. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు కడా తీయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే బిహార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సకీబ్‌ హుసేన్‌ను ఆడించినా బాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన శివం మావి.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీయగలిగాడు. ఈ యూపీ పేసర్‌ చివరగా 2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ శివం మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. మరి రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అతడికి రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుందేమో చూడాలి!

రాజస్తాన్‌తో మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ తుదిజట్టు అంచనా
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్‌ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్‌/శివం మావి.

చదవండి: BCCI: ఫోన్‌ చూసిన రోమీ, వైభవ్‌ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement