IPL 2026: పంజాబ్‌ను గెలిపించిన కన్నోల్లీ | IPL 2026: Punjab Kings beat Gujarat Titans | Sakshi
Sakshi News home page

IPL 2026: పంజాబ్‌ను గెలిపించిన కన్నోల్లీ

Mar 31 2026 11:35 PM | Updated on Mar 31 2026 11:35 PM

IPL 2026: Punjab Kings beat Gujarat Titans

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ ​కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్‌ మరో 5 బంతులు (19.1 ఓవర్లలో) మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్‌ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.

తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్‌ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కన్నోల్లీ సంయమనంతో ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్‌ బార్ట్‌లెట్‌ (11 నాటౌట్‌) సహకరించాడు. 

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (37) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (18), ప్రియాంశ్‌ ఆర్య (7), నేహల్‌ వధేరా (3), శశాంక్‌ సింగ్‌ (4), స్టోయినిస్‌ (0), జన్సెన్‌ (9) నిరాశపరిచారు. 

గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-29-3) అద్భుతమైన స్పెల్‌తో పంజాబ్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా.. రషీద్‌ ఖాన్‌ (4-0-29-1) పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లలో రబాడ, అశోక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు గుజరాత్‌ సైతం​ ఓ దశలో భారీ స్కోర్‌ చేసేలా కనిపించినప్పటికీ.. పంజాబ్‌ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్‌ (4-0-28-2), మార్కో జన్సెన్‌ (4-0-20-1), బార్ట్‌లెట్‌ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్‌ చేసి గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్‌ సింగ్‌ (4-0-42-0) మినహా పంజాబ్‌ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (18), షారుక్‌ ఖాన్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్‌ తెవాతియా (11), రషీద్‌ ఖాన్‌ (0) అజేయంగా నిలిచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement