ఐపీఎల్ 2026 నుంచి ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న (మే 10) ఆర్సీబీతో జరిగిన క్లోజ్ ఫైట్ పరాభవం తర్వాత నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. ఆర్సీబీ కొట్టిన ఈ దెబ్బకు ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చివరి బంతి వరకు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 167 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేసిన ముంబై.. అందుకు తగ్గట్టుగానే అద్భుతంగా పోరాడింది. చివరి ఓవర్‌లో 15 పరుగులను కాపాడుకునే క్రమంలో ఆ జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ ఘోర తప్పిదం చేశాడు.
ఘజన్‌ఫర్ రూపంలో నాణ్యమైన స్పిన్ బౌలర్ ఉన్నా, పెద్దగా అనుభవం లేని రాజ్ బవా చేతికి బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్‌లో బవా చివరి బంతి వరకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఘోర తప్పిదాలు చేసి ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు
ఆ ఓవర్‌లో బవా ఒత్తిడికిలోనై 3 వైడ్లు, ఓ నో బాల్ సహా 11 బంతులు వేశాడు. అధికారిక నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ ఊహించని రీతిలో సిక్సర్ కొట్టి ఆర్సీబీ గెలుపుకు మార్గం సుగమం చేశాడు. చివరి 2 రెండు బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదో బంతికి భువీ సింగిల్ తీశాడు.
దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక్కడ బవా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ బంతిని ఎదుర్కొన్న రసిక్ సలామ్ దార్ స్ట్రయిట్‌గా ఆడగా.. బవా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రసిక్ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీని గెలిపించాడు.
మ్యాచ్ అనంతరం స్కై తీసుకున్న తప్పుడు నిర్ణయానికి విమర్శలపాలయ్యాడు. ఘజన్‌ఫర్ కాకపోయినా విల్ జాక్స్ రూపంలో మరో ఆప్షన్ ఉన్నా అతడు వినియోగించుకోలేదు. అప్పటికే 2 ఓవర్లలో 24 పరుగులిచ్చిన బవా చేతికి బంతినిచ్చి ఓటమిని కొని తెచ్చుకున్నాడు.
స్కై తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఒక్క మ్యాచ్ ఓటమినే కాకుండా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా క్లోజ్ చేసింది. వరుసగా మరో సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత తమకేదీ కలిసిరావట్లేదని వాపోతున్నారు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో గత రెండు మ్యాచ్‌లుగా స్కై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


